చిన్న పక్షులే.. ప్రయాణం మాత్రం ప్రపంచ రికార్డు స్థాయిలో!

మణిపూర్: చూడటానికి చిన్న పక్షులే.. కానీ వాటి ప్రయాణం మాత్రం అసాధారణం. వేల కిలోమీటర్ల సముద్రాన్ని ఆహారం, నీరు లేకుండానే నాన్‌స్టాప్‌గా దాటేస్తున్నాయి. అమూర్ ఫాల్కన్ పక్షులు మరోసారి తమ అద్భుత వలస ప్రయాణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మణిపూర్‌లో కొన్ని రోజుల పాటు కీటకాలను ఆహారంగా తీసుకుని శక్తిని కూడగట్టుకున్న ఈ పక్షులు.. అక్కడి నుంచి ఆఫ్రికాలోని సోమాలియా వరకు వేల కిలోమీటర్లు ఎగిరి చేరుకున్నాయి.
శాటిలైట్ ట్రాకర్ల ద్వారా గుర్తించిన రెండు అమూర్ ఫాల్కన్లు అపపాంగ్, అలాంగ్ ఈ అసాధారణ ప్రయాణాన్ని పూర్తి చేశాయి. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు వెల్లడించిన వివరాల ప్రకారం.. అలాంగ్ 5,700 కిలోమీటర్లు కేవలం 101 గంటల్లో ప్రయాణించగా, మగ పక్షి అపపాంగ్ సుమారు 5,400 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా ఎగిరి సోమాలియాకు చేరుకుంది. ఈ ప్రయాణంలో దాదాపు 3,000 కిలోమీటర్లు అరేబియా సముద్రం మీదుగానే సాగడం విశేషం.
మణిపూర్‌లో చెదపురుగులే ప్రధాన ఆహారం!
ఈ చిన్న పక్షులు అంత దూరం ప్రయాణించడానికి అవసరమైన శక్తిని మణిపూర్‌లోనే సమకూర్చుకుంటాయి. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో పెద్ద సంఖ్యలో బయటకు వచ్చే రెక్కల చెదపురుగులను ఆహారంగా తీసుకుంటాయి. వీటిలో ఉండే ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు పక్షులకు శక్తిని అందిస్తాయి.
వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) 2022 నివేదిక ప్రకారం.. మణిపూర్‌లో సేకరించిన ఆహార నమూనాల్లో గుర్తించిన కీటకాలలో సుమారు 65 శాతం చెదపురుగులే ఉన్నాయి. వీటిని తినడం ద్వారా పక్షులు శరీరంలో కొవ్వును నిల్వ చేసుకుంటాయి. అదే సముద్ర ప్రయాణంలో ఇంధనంలా పనిచేస్తుంది.
ఏడాదికి 22 వేల కిలోమీటర్ల వలస ప్రయాణం!
అపపాంగ్, అలాంగ్ మణిపూర్‌లోని తమెంగ్లాంగ్ జిల్లా చియులువాన్ గ్రామంలో దాదాపు 25 రోజుల పాటు బస చేశాయి. అనంతరం నవంబర్ 19న ఆఫ్రికా దిశగా ప్రయాణం ప్రారంభించాయి. వీటి కదలికలను అటవీశాఖ, వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాటిలైట్ ట్రాన్స్మిటర్ల ద్వారా పర్యవేక్షించాయి.
సోమాలియా చేరుకున్న తర్వాత కూడా వీటి ప్రయాణం ముగియదు. అక్కడి నుంచి దక్షిణాఫ్రికాలోని తమ విడిది ప్రాంతాలకు వెళ్తాయి. ఇలా ఆసియా నుంచి ఆఫ్రికా వరకు మొత్తం 23 దేశాల మీదుగా ఏడాదికి దాదాపు 22 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.
వేట నుంచి సంరక్షణ వరకు.. గ్రామస్తుల కృషి!
అమూర్ ఫాల్కన్ల కథలో మరో ఆసక్తికర అంశం వాటి సంరక్షణ. ఒకప్పుడు మణిపూర్‌లోని తమెంగ్లాంగ్ ప్రాంతంలో ఈ పక్షులను పెద్ద సంఖ్యలో వేటాడేవారు. ఒక్కో సీజన్లో లక్షకు పైగా పక్షులు వేటకు బలయ్యేవని అంచనాలు ఉన్నాయి. అయితే అటవీశాఖ, స్థానిక గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, వేట నియంత్రణ చర్యలతో పరిస్థితి మారింది. చర్చిలు, స్థానిక సంఘాలు కూడా ఈ పక్షుల సంరక్షణలో భాగస్వాములయ్యాయి.
మణిపూర్‌లో లభించే సమృద్ధిగా ఉండే ఆహారం ఈ పక్షులకు సుదీర్ఘ ప్రయాణానికి శక్తినిస్తుంటే.. స్థానికుల సంరక్షణ వాటికి సురక్షితమైన విడిది కల్పిస్తోంది. చిన్న పక్షుల అసాధారణ ప్రయాణం వెనుక ప్రకృతి అద్భుతంతో పాటు మనుషుల కృషి కూడా ఉందనడానికి ఇదే నిదర్శనం.
Tags
-
Home
-
Menu
