17 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

అమ్మవారి బ్రహ్మోత్సవాలను పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలి
పంచ్మితీర్థానికి విస్తృతంగా ఏర్పాట్లు
కంట్రోల్ కమాండ్ సెంటర్ నుండి పర్యవేక్షణ
అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక
టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్
మన తెలంగాణ, నవంబర్ 11: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్హ్మ్రోత్స్వాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరు ఆస్థానమండంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి సీవీఎస్వో కే. వి. మురళీకృష్ణ లతో కలసి టిటిడి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే రెండుమార్లు జిల్లా ఎస్పీ, టిటిడి సివిఎస్వో, టిటిడి జేఈవో సమీక్ష నిర్వహించారు. తిరుచానూరు ఆలయం పరిసరాలలోను, పద్మసరోవరం, హోల్డింగ్ పాయింట్లు వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజు దాదాపు 75 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు అన్నప్రసాదాలు సిద్ధం చేసుకోవాలని, పటిష్ట క్యూలైన్లు, జర్మన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులు, వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. దాదాపు 600 మంది పోలీసులు, 700 మంది టిటిడి సెక్యూరిటీ , 900 మంది శ్రీవారి సేవకులు, 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తారన్నారు.
అదేవిధంగా, రోజువారి 10 వేల మందికి అన్నప్రసాదాలు, పంచమి తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్లలో దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు వేచియుండే అవకాశం ఉందన్నారు. తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపడుతారన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వచ్చారని, శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వస్తున్నారని చెప్పారు. తిరుచానూరులో భారత రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుచానూరులో ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయాలకు మహిళా భక్తుల సంఖ్య పెరుగుతోందని, బ్రహ్మోత్సవాలకు మరింత రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భక్తులను టిటిడి ఈవో ఆహ్వానించారు.
-
Home
-
Menu
