కర్రెగుట్టలో మందుపాతర పేలి ఆదివాసీ మృతి

ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ అటవీ ప్రాంతంలో మందుపాతర పేలి ఓ ఆదివాసీ మృతిచెందాడు. కర్రెగుట్ట సమీపంలోని పామనూరు అటవీ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. మృతుడిని ఎదుర్ల చెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావుగా గుర్తించారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నాగేశ్వరరావు మరో ఐదుగురితో కలిసి గృహ అవసరాల కోసం వెదురు బొంగులు సేకరించేందుకు కర్రెగుట్ట అటవీ ప్రాంతానికి వెళ్లాడు. వెదురు బొంగులు సేకరించుకొని తిరిగి వస్తుండగా పామనూరు సమీపంలో అమర్చిన ఐఈడీపై ప్రమాదవశాత్తూ కాలు వేయడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును సహచరులు కిందకు తీసుకువచ్చేలోపే మృతిచెందాడు.
గిరిజనుల్లో కొనసాగుతున్న భయం:
అటవీ ప్రాంతాల్లో పశువుల మేత, వెదురు, ఇప్పపూలు, ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడే గిరిజనులు మందుపాతరల భయంతో ఆందోళన చెందుతున్నారు. కర్రెగుట్ట ప్రాంతంలో మరిన్ని ఐఈడీలు ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ భద్రతా బలగాలు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి మందుపాతరలను నిర్వీర్యం చేయాలని గిరిజన సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
-
Home
-
Menu
