కరీంనగర్ లో ఆర్టిసి బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన బస్సు...
హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్తుండగా ఘటన..
బస్సులో 50మంది ప్రయాణికులు..
స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు...
ఊపిరి పీల్చుకున్న అధికారులు
ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
మన తెలంగాణ/చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో బుధవారం భారీ బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దాదాపు 50మంది ప్రయాణికులతో హుస్నాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తుండగా సుందరగిరి శివారుకు చేరుకోగానే స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. బావి పై భాగంలో బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. తృటిలో ఘోర ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును అదుపులోకి తీసుకురావడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే చిగురుమామిడి ఎస్సై జగదీశ్వర్, ఆర్టీసీ అధికారులు తమ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించేలా సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద సమాచారం అందుకున్న హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తహసిల్దార్ కనకయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అందే సురేష్, జిల్లా కార్యదర్శి బడుకోలు దేవేందర్ రెడ్డి, నాయకులు చిట్టుమల్ల రవీందర్, పోటు మల్లారెడ్డి తదితరులు ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రయాణికులను పరామర్శించారు. బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అందే సురేష్‌లకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన తీరును, ప్రయాణికుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తగిన సహాయం అందేలా చూడాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Tags
-
Home
-
Menu
