చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి

వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం, అల్లిఖాన్‌పల్లి గ్రామంలో దరసరా పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. ఈత కోసం చెరువుకు వెళ్లిన ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఈ సంఘటన గ్రామంలోని రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. గ్రామస్థులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... అల్లిఖాన్‌పల్లి గ్రామానికి చెందిన పాండు, అరుణ కూతురు వృక్షిత (13), రాములు, లక్ష్మి ఇద్దరు కుమార్తెలు ప్రణీత (14), నందిని (16) ముగ్గురూ కలిసి గ్రామ సమీపంలోని చింతల్‌చెరువును చూడడానికి వెళ్ళారు. చెరువు అలుగు పారుతుండడంతో వారు అలుగు సమీపంలో నీటిలో కాసేపు ఆడుకున్నారు. ఆ పక్కనే లోతైన గోతులు ఉన్న విషయం వారికి తెలియక చెరువలో ఇంకా లోపలికి వెళ్ళారు. దీంతో ముగ్గురు బాలికల్లో వృక్షిత, ప్రణీత ఇద్దరు లోతైన గోతిలో మునిగిపోయారు. మరో బాలిక నందిని సైతం త్రుటిలో గోతిలో పడకుండా తప్పించుకుంది. ఇద్దరు బాలికలు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన చెరువు గట్టుపైన ఉన్న
పలవురు వెంటనే వారిని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. ప్రణీతను నీటిలో నుండి బయటికి తీయగా కొనఊపిరితో ఉండడంతో చికిత్స నిమిత్తం కోస్గి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. వృక్షిత మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. పండగ పూట సంతోషంగా గడపాల్సిన కుటుంబాల్లో చిన్నారుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. గంట క్రితం వరకు తమ ముందు ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారులు అకాల మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతి చెందిన చిన్నారులు ఇద్దరు దుద్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9 తరగతులు చదువుతున్నారు. కాగా, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి విజయరామారావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుబూతిని తెలిపారు. ఇరు కుటుంబాలకు తనవంతుగా రూ.5,000 ఆర్థిక సహయం అందజేశారు. మండల పరిదిలోని హకీంపేట్‌కు చెందిన నర్సింహారెడ్డి సైతం మృతుల కుటుంబాలను పరామర్శించి వారిరువురి కుటుంబాలకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
-
Home
-
Menu
