ఎసిబి వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు

ఎసిబి వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు
X
మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల జిల్లాల్లో శనివారం ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఎసిబి వలకు చిక్కారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఎల్లంపేట్ మున్సిపల్

మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల జిల్లాల్లో శనివారం ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఎసిబి వలకు చిక్కారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఎల్లంపేట్ మున్సిపల్ ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ రాధాకృష్ణారెడ్డి మూడున్నర లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలోని సోమారంలో గంగస్థాన్ హెచ్‌ఎండిఎ వెంచర్ చుట్టూ నిర్మించిన కాంపౌండ్‌వాల్‌ను కూల్చివేస్తామని బెదిరిస్తూ ఐదు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి డిఎస్‌పి గంగాసాని శ్రీధర్ సూచనల మేరకు వెంచర్ యజమానితో బాధితుడు ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో మొదటగా లక్ష రూపాయలను టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ రాధాకృష్ణారెడ్డికి ఇచ్చాడు. మిగతా నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా శనివారం ఉదయం 9 గంటలకు కొంపల్లి పరిధిలోని రాయ్‌చంద్ మాల్ వద్దకు బాధితుడు మూడున్నర లక్షలు తీసుకువచ్చి ఇవ్వగా, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ఎడమ చేతితో కారులోని ఫ్రంట్ బాక్స్‌లో పెట్టినట్లు కెమికల్ టెస్టుల ద్వారా బయటపడింది. వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు.

అంతేకాకుండా అతని నివాసంతో పాటు వివిధ కార్యాలయాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎసిబి డిఎస్‌పి తెలిపారు. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ రాధాకృష్ణారెడ్డితోపాటు మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్‌ను కలిపి విచారిస్తామని ఫోన్ చేసి కార్యాలయానికి రమ్మంటే రాలేదని తెలిపారు. అయితే ఆయనపై కూడా అనుమానం కలుగుతోందని తెలిపారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బానోత్ దుర్గాప్రసాద్ రైతు వద్ద పది వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానికి చెందిన ఓ రైతుకి ఎంజిఎన్‌ఆర్ ఇజిఎస్‌లో మంజూరైన పశువుల షెడ్డు నిర్మాణానికి 50 వేల రూపాయలు మంజూరైంది. అయితే, ఎంబి రికార్డు కోసం ఆ రైతును టెక్నికల్ అసిస్టెంట్ పది వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి డిఎస్‌పి మధు ఆధ్వర్యంలో ఎంపిడిఓ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బులను రికవరీ చేసి కరీంనగర్ ఎసిబి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

Tags

Next Story