రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి

సద్దుల బతుకమ్మ, దసరా పండుగ పూట పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ పట్టణ శివారులో మంగళవారం తెల్లవారుజామున రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులిద్దరూ మామ, మేనల్లుడు కావడం విశేషం. ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ రోడ్డు ప్రమాదంతో పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన స్థానిక సివిల్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ముత్యం రాకేష్ (31), ప్రైవేట్ స్కూల్‌లో పనిచేసే పూదరి రోహిత్ కుమార్ అలియాస్ అభి (25), సుగ్లాంపల్లికి చెందిన పాపని ఆదర్శ్ (22) ముగ్గురు స్నేహితులు. వీరు సుద్దాల గ్రామానికి వెళ్లి తిరిగి సుల్తానాబాద్‌కు మోటార్ సైకిల్‌పై ముగ్గురు వస్తున్నారు.
అదే సమయంలో పల్సర్ బైక్‌పై వెళ్తున్న అల్లీపూర్ గ్రామానికి చెందిన గసిగంటి రఘు (21) ఎదురెదురుగా రెండు వాహనాలతో పరస్పరం ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కరీంనగర్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా ముత్యం రాకేష్, పూదరి రోహిత్ కుమార్ మార్గమధ్యంలోనే మృతి చెందారు. గాయపడిన పాపని ఆదర్శ్, గసికంటి రఘు కరీంనగర్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పాపని ఆదర్శ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. కాగా, ఇద్దరు మృతుల్లో రాకేశ్‌కు రోహిత్ మేనల్లుడు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ శ్రావణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, అంత్యక్రియ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
-
Home
-
Menu
