ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు

నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటు చేసుకున్న అనుమానాస్పద మరణాలు కలకలం రేపాయి. స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో హత్య? ఆత్మహత్యనా? లేక డ్రగ్స్ ఓవర్‌డోసా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన యువకులను పోలీసులు జహంగీర్, ఇర్ఫాన్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు, మరణాలు సహజంగా సంభవించి ఉండకపోవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో లోపల కీలక ఆధారాలు లభించాయి.
మత్తు ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్‌కు సంబంధించిన శాంపిల్స్ అక్కడ దొరికాయి. వీటిని బట్టి, ఓవర్‌డోస్‌తో మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడం వల్లే యువకులు మరణించి ఉండవచ్చని అధికారులు బలమైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ మరణాలకు గల అసలు కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతంలో విచారణను వేగవంతం చేశారు. హత్య లేదా? ఏదైనా నేర సంబంధం ఉందా? అనే కోణంలో కూడా డేటాను సేకరిస్తున్నారు. ఈ కేసుపై పూర్తి స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
-
Home
-
Menu
