పొలం దారి కోసం సొంత కజిన్‌ను హత్య చేసిన పోలీస్ కానిస్టేబుల్, రిటైర్ట్ ఎఎస్ఐ

తండ్రితో కలిసి దాడి.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. నిందితులిద్దరూ అరెస్ట్
మన తెలంగాణ - క్రైమ్ డెస్క్: పొలం దారి విషయంలో మొదలైన చిన్న వివాదం చివరకు హత్యకు దారితీసింది. చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తన సొంత కజిన్‌పై తండ్రితో కలిసి దాడి చేసి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడైన కానిస్టేబుల్‌తో పాటు అతడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాగ్పత్ జిల్లా చప్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హలాల్‌పూర్ గ్రామానికి చెందిన సంజీవ్ ఖోకర్కు, అతడి బంధువుల కుటుంబానికి మధ్య వ్యవసాయ పొలానికి వెళ్లే దారి విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తరచూ ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన రోజు సన్నీ ఖోకర్ అనే యూపీ పోలీస్ కానిస్టేబుల్ తన తండ్రి ఉదయ్‌రాజ్ ఖోకర్తో కలిసి పొలంలో చెరకును ట్రాలీలో నింపుతున్నాడు. ఆ సమయంలో దారికి అడ్డంగా చెట్లు ఉండటంపై అక్కడికి వచ్చిన సంజీవ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో సన్నీ, అతడి తండ్రి కలిసి సంజీవ్‌పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
ఈ ఘటనలో నిందితులైన సన్నీ ఖోకర్ ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా, అతడి తండ్రి ఉదయ్‌రాజ్ ఖోకర్ ఢిల్లీ పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సన్నీ, ఉదయ్రాజ్లను నిందితులుగా గుర్తించారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీస్ మీడియా సెల్ వెల్లడించింది. పొలం దారి విషయంలో మొదలైన వివాదం హత్యకు దారితీయడంతో హలాల్‌పూర్ గ్రామంలో ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
-
Home
-
Menu
