ఉప్పల్ లో ప్లే గ్రౌండ్‌లో ఘర్షణ… మెయిన్ రోడ్డుపై కానిస్టేబుల్ హత్య

చిల్కానగర్‌లో దారుణ ఘటన
పిలిపించి పబ్లిక్ చూస్తుండగానే కత్తులతో వెంటపడి దాడి
భయంతో పరుగులు తీసిన స్థానికులు
మన తెలంగాణ / ఉప్పల్: ఉప్పల్ పరిధిలోని చిల్కానగర్ రోడ్డులో ఆదర్శనగర్ సాయిబాబా గుడి వద్ద ఆదివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం… చెంగిచర్ల ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న సుధీర్ రెడ్డి (35) హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం చిల్కానగర్ రోడ్డులోని ఆదర్శనగర్ ప్లే గ్రౌండ్ వద్ద కొంతమంది యువకులతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.
ఘర్షణ అనంతరం దుండగులు సుధీర్ రెడ్డిని వెంబడిస్తూ మెయిన్ రోడ్డువరకు వచ్చి కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. పలుమార్లు కత్తులతో పొడవడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు తెలిసింది. ఘటన అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. పబ్లిక్ చూస్తుండగానే ఈ దాడి జరగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడు సుధీర్ రెడ్డి స్నేహితుడైన సంతోష్ నాయక్ అనే వ్యక్తి పేరు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. చిల్కానగర్ ప్రాంతానికి పిలిపించి హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tags
-
Home
-
Menu
