అర్ధరాత్రి ఘోరం.. వృద్ధ మహిళపై అత్యాచారం, హత్య

అర్ధరాత్రి ఘోరం.. వృద్ధ మహిళపై అత్యాచారం, హత్య
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 60 ఏళ్ల వృద్ధ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మోహన్‌లాల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి మహిళపై సామూహిక అత్యాచారం అనంతరం తీవ్రంగా దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బహిర్భూమికి వెళ్లిన ఓ గ్రామస్థుడు మహిళ కేకలు విని అప్రమత్తమయ్యాడు. అతడు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోగా, రక్తపు మడుగులో వృద్ధురాలు మృతదేహం కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో మూడో అనుమానితుడి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. మహిళ మృతదేహానికి మహిళా ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం పోస్టుమార్టం నిర్వహించింది. గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణ అయింది. మహిళ శరీరంపై తీవ్ర గాయాల గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు ముందు మహిళ నిందితుల్లో ఒకరితో కలిసి మద్యం సేవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. అనంతరం ఇద్దరి మధ్య ఏదో విషయంపై వాగ్వాదం జరగడంతో దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు అధికారులు వివరించారు.

Tags

Next Story