విజువల్ వండర్‌గా ‘వారణాసి’

విజువల్ వండర్‌గా ‘వారణాసి’
X

సూపర్ స్టార్ మహేష్‌బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వారణాసి’అనే టైటిల్‌ను ఖరారు చేశారు దర్శకుడు రాజమౌళి. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మహేష్ బాబు లుక్‌తో పాటు టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన విజువల్స్, నేపథ్య సంగీతంతో అబ్బురపరిచింది. ఇందులో ‘వారణాసి’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. మహేష్ బాబు రక్తం నిండిన దేహంతో, నందిపై ఒక చేత్తో త్రిశూలం పట్టుకొని కనిపించిన స్టిల్ అదిరిపోయింది. ఎగురుతున్న జుట్టు, ఆగ్రహంతో కనిపించిన మహేష్ లుక్‌ను చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక వారణాసి గురించిన కథ కావడంతో ఈ సినిమాకు అదే టైటిల్‌ను రాజమౌళి ఫైనల్ చేశారు.

ఇందులో మహేష్... రుద్ర పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇక కథానాయిక మందాకినిగా ప్రియాంక చోప్రా, ప్రతినాయకుడు కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్ బ్యానర్ అధినేత, నిర్మాత కెఎల్ నారాయణ... యువ నిర్మాత కార్తికేయతో కలిసి నిర్మిస్తున్నారు. 2027 వేసవిలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మహేష్‌బాబు మాట్లాడుతూ.. “ప్రతి నటుడి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసే సినిమా, పాత్ర ఒకటి ఉంటుంది. నాకు ‘వారణాసి’ అలాంటిదే. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ‘వారణాసి’ విడుదలైనప్పుడు ఈ మూవీ చూసి యావత్ దేశం గర్వపడుతుంది”అని తెలియజేశారు.

రాజమౌళి మాట్లాడుతూ “నాకు మొదటి నుంచి రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం. మహాభారతం తెరకెక్కించడం నా డ్రీమ్ అని అందరికీ తెలుసు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని అనుకోలేదు. కానీ ఒకొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదు.. గాల్లో ఉన్నానని అనిపించింది. మొదటిసారి మహేష్ కి రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే నాకే గూస్ బమ్స్ వచ్చాయి. మహేష్ కృష్ణుడిగా బాగుంటాడు.. కొంటెతనం ఉంటుంది. రాముడి లాంటి ప్రశాంతమైన పాత్రకు మహేష్ సూటవుతాడా లేదా అనుకుంటూనే ఫొటో షూట్ చేశాం. ఇప్పటికి 60 రోజులు షూట్ చేశాం. ప్రతీ రోజూ.. ఒక ఛాలెంజ్. మహేష్ మీరనుకున్నదానికన్నా ఎక్కువ పరాక్రమంగా ఉంటాడు”అని అన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ “రాజమౌళి ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు ఒక కామిక్ చదువుతున్నట్లు అనిపించింది. ఇక రాజమౌళి ఇండియన్ సినిమాను మరోసారి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ సినిమా మహేష్ కోసమే.. మహేష్ ఉన్నది ఈ సినిమా కోసమే. ఇక ఈ సినిమాలో నా పాత్ర చాలా భయపెడుతుంది”అని చెప్పారు.

నిర్మాత కెఎల్ నారాయణ మాట్లాడుతూ “15 ఏళ్ల క్రితం రాజమౌళితో సినిమా చేద్దామని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇంత సమయం పడుతుందని ఆయన, నేనూ ఊహించలేదు. ఈ 15 ఏళ్లలో రాజమౌళి తెరకెక్కించిన ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వచ్చాయి. ఈ సినిమాను ఒప్పుకున్నందుకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ప్రియాంచ చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ధన్యవాదాలు”అని అన్నారు.

Tags

Next Story