నా చావుకు కారణం వెంకటేష్... యువతి సూసైడ్ నోట్

ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య
నన్ను వేధించాడు.. అందుకే చనిపోతున్నా అంటూ సూసైడ్ నోట్
మన తెలంగాణ / జైపూర్ : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ప్రేమ పేరుతో వేధింపులకు గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. యువతి రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జైపూర్ ఎస్సై భూమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకుమట్ల గ్రామానికి చెందిన గోషిక రాజేష్, బానిస దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో నాలుగో సంతానమైన గోషిక మాధవి (26) బీ ఫార్మసీ పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన గోనె వెంకటేష్ అనే సింగరేణి ఉద్యోగి గత రెండేళ్లుగా తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంకటేష్‌తో పాటు అతని తల్లి శంకరమ్మ, చెల్లెలు కూడా మాధవిపై పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చేవారని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ వెంకటేష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, తరచూ వేధింపులు కొనసాగించడంతో మాధవి తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఆత్మహత్యకు ముందు మాధవి రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో నన్ను వేధించిన వెంకటేష్ కారణంగానే చనిపోతున్నాను. నా చావుకు అతడే బాధ్యుడు. నాపై నిందలు మోపవద్దు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, సూసైడ్ నోట్ ఆధారంగా సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు జైపూర్ ఎస్సై భూమేష్ తెలిపారు. ఈ ఘటన టేకుమట్ల గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, బంధువులు పోలీసులను కోరుతున్నారు.
Tags
-
Home
-
Menu
