ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు దేవా మృతి

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు దేవా మృతి
X

ప్రత్యేకమైన స్థానిక ‘గానా’ శైలిని, ఫోక్‌బీట్స్‌ను మెయిన్‌స్ట్రీమ్ సినిమా సంగీతంలోకి తీసుకువచ్చి విశేష ప్రజాదరణ పొందిన ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారంనాడు తుదిశ్వాస విడిచారు.తమిళం మాట్లాడే ప్రజలకు దేవా అందించిన కానుకగా ‘గానా’ పాటలను చెప్పుకోవచ్చు. అణగారిన వర్గాల ప్రపంచాన్ని.. వారి ఇష్టాయిష్టాలను, యువత జీవనంలోని ఒడిదుడుకులను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చిన సంగీత రూపంగా దీనిని అభివర్ణించవచ్చు.దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో దేవా 400కు పైగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలకు సంగీతం అందించారు. ఇందులో రజనీకాంత్ హీరోగా సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘అణ్ణామలై’ (1992), ‘బాషా’ (1995) చిత్రాలతో పాటు కమల్ హాసన్ నటించిన ‘పమ్మల్ కె. సంబంధం’ (2002), అదే ఏడాది విడుదలైన ‘పంచతంత్రం’ వంటి ఘన విజయాలు ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్, పవన్ కల్యాణ్ తొలిప్రేమ చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ఆయా సినిమాల విజయంలో సింహభాగంగా నిలిచింది.

భక్తిశ్రద్ధలు కలిగిన దేవా గంభీర స్వరం కూడా ఎంతో ప్రజాదరణ పొందింది. ఆయన స్వయంగా పలు రకాల పాటలు పాడారు. దేవా స్వరపరిచిన హిట్ పాటలతోపాటు ఆయన అందించిన కొన్ని నేపథ్య సంగీతాలు కూడా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బాషా’లోని ఉత్సాహభరితమైన ‘బాషా.. బాషా’ నేపథ్య సంగీతం ఇందులో ఒకటి. తమిళ చిత్రం ‘సూర్యన్’ (1992)లో సీనియర్ హాస్యనటుడు గౌండమణి హావభావాలకు దేవా అందించిన నేపథ్య సంగీతాన్ని సినీప్రియులు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుచేసుకుంటారు. దేవా ఇటీవల నిర్వహించిన సంగీత కచేరీల్లోనూ ఆ సంగీతాన్ని వినిపించేవారు. దేవా తెల్లటి పైజామా-కుర్తా, తెల్లటి చెప్పులతో కనిపించడం ఆయన ప్రత్యేక గుర్తింపుగా ఉండేది. ఆయన పాదరక్షల ఎంపికకు రజనీకాంత్ స్ఫూర్తిగా నిలిచినట్లు సమాచారం. తమిళనాడు ప్రభుత్వ కలైమామణి పురస్కారంతో పాటు, ఆసై చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా రాష్ట్ర అవార్డును అందుకున్నారు.

దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా కూడా ప్రముఖ సంగీత దర్శకుడే.

దేవా మృతిపై కోలీవుడ్, టాలీవుడ్ తదితర చిత్ర పరిశ్రమలకు చెందినవారు, తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో 18న అంత్యక్రియలు

దేవా అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ పూర్తి లాంఛనాలతో 18వ తేదీ ఆదివారంనాడు నిర్వహించనున్నారు. ఆయన పార్థివ దేహాన్ని చెన్నైలోని టినగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ప్రజాసందర్శనార్థం శనివారం మధ్యాహం ఒంటిగంటకు వరకూ ఉంచారు. అక్కడి నుంచి అంత్యక్రియల కోసం ఆయన స్వగ్రామమైన ఆర్కాట్ సమీపంలోని మంగాడు గ్రామానికి తరలిస్తున్నారు.

Tags

Next Story