మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిపై బుధవారంపేట గ్రామస్థులు ధర్నా

మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిపై బుధవారంపేట గ్రామస్థులు ధర్నా
X

మగిరి మండలం, బుధవారంపేట గ్రామపంచాయతీ పరిధి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆర్జీ 3 ఏరియా ఓసిపి2 విస్తరణలో భాగంగా బుధవారంపేట పంచాయతీ పరిధిలో భూములను సేకరించడానికి సింగరేణి పనులను ప్రారంభించింది. కొద్దిరోజుల క్రితమే ఇక్కడ ఉన్న పాత నిర్మాణాలకు ఇంటి నెంబర్లు వేశారు. తాజాగా ఇండ్లకు నంబర్లు వేయడానికి అధికారులు మంగళవారం ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని సింగరేణి పూర్తిగా సేకరించాలని, లేదంటే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. రామగిరి పర్యటనలో భాగంగా బుధవారంపేట వచ్చిన కలెక్టర్ అక్రమ కట్టడాల నెపంతో రెవెన్యూ, సింగరేణి అధికారుల సమక్షంలో ఇండ్లను కూల్చివేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా,

నోటీసులు ఇవ్వకుండా ఎవరూ లేని సమయంలో ఇండ్లను ఎలా కూల్చి వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న గోదావరిఖని ఎసిపి మడత రమేష్, వన్, టూటౌన్ సిఐలు, ఎస్‌ఐలు శ్రీనివాస్, దివ్య, స్పెషల్ పార్టీ పోలీసులు గ్రామస్థులతో చర్చలు జరిపినప్పటికీ ధర్నా విరమించేందుకు ససేమిరా అన్నారు. తమ సొంత పట్టా భూముల్లో ఇండ్లు నిర్మించుకుంటే ఎందుకు కూల్చివేతకు పాల్పడినట్లని బాధితులు ప్రశ్నించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ దగ్గర ఉండి కూల్చి వేయించారని, తమకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చే అధికారం లేదని, కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని అంతవరకు తమ ఆందోళన విరమించమని భీష్మించుకొని బైఠాయించారు. దీంతో మంథనిపెద్దపల్లి ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో తాత్కాలికంగా పరిస్థితి సద్దుమణిగింది.

Tags

Next Story