ఒక్క దీపం... ఒక భవిష్యత్తు

ఒక్క దీపం... ఒక భవిష్యత్తు
X

చీకటి అంటే కేవలం వెలుతురు లేకపోవడం కాదు. ఒక చిన్నారి పుస్తకం మూసేయాల్సి రావడం. ఒక తల్లి రాత్రి వేళ ఇంటి గడప దాటి బయటకు వెళ్లలేకపోవడం. ఒక గ్రామసభ చీకట్లోనే ముగిసిపోవడం. ముఖ్యంగా... ఒక తరం కలలు వెలుగు కోసం ఎదురుచూడాల్సి రావడం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, పినపాక మండలాల్లోని కొన్ని గిరిజన ఆవాసాల్లో సాయంత్రం కాగానే చీకటి కమ్ముకుంటుంది. అది ఒక్కరోజు చీకటి కాదు. ఏళ్లుగా అక్కడి జీవితాలను వెంటాడుతున్న చీకటి.

అంగేరిగూడెం, నీలాద్రిపేట, తీర్లాపురం, టేకులగూడెం, అశ్వాపురం పాడు... ఇలా 16 గిరిజన ఆవాసాల్లో సుమారు 450 కుటుంబాలు, 2,500 మంది నివసిస్తున్నారు. వీరిలో చాలామంది ఇళ్లకు ఇప్పటికీ విద్యుత్ వెలుగు అందలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దండుపల్లి ఆవాసంలోనూ పరిస్థితి భిన్నంగా లేదు.

చీకటి పడగానే అక్కడ జీవితం మరో రూపం దాలుస్తుంది.

పిల్లల చేతుల్లోని పుస్తకాలు మూసుకుపోతాయి. మహిళలు రాత్రివేళ బయటకు వెళ్లాలంటే భయపడాల్సి వస్తుంది. పెద్దలు సమావేశాలు పెట్టుకోవాలన్నా సరైన వెలుగు ఉండదు. రాత్రి వేళ అత్యవసర పరిస్థితి వస్తే బయటకు రావడం కూడా కష్టమే.

వెలుగు కోసం ఎదురుచూస్తున్న బాల్యం

ఈ ఆవాసాల్లో సమస్య కేవలం విద్యుత్తుతో ఆగిపోలేదు. విద్య కూడా అందని ద్రాక్షగానే ఉంది. 6 నుంచి 9 సంవత్సరాల వయస్సున్న 20 నుండి 25 మంది పిల్లలు ఉన్న కొన్ని ఆవాసాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు లేవు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు ఉన్న చోట్ల కూడా పక్కా భవనాలు లేక పిల్లలు మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.

అంతకంటే బాధాకరమైన విషయం... చదువు కొనసాగించాల్సిన వయసులోనే కొందరు పిల్లలు చదువు మానేస్తున్నారు. కమ్యూనిటీ గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల పై చదువులకు వెళ్లే మార్గం మూసుకుపోతోంది. చివరికి చదువు మధ్యలోనే ఆపేసి కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రభుత్వ కార్యాలయాల తలుపులు ఎన్నిసార్లు తట్టినా... సమస్యలు ఎన్నిసార్లు చెప్పినా... వారి జీవితాల్లో మౌలిక మార్పు మాత్రం నెమ్మదిగానే కనిపిస్తోంది.

ఆగిపోయిన విద్యుత్ స్తంభాలు

“కరకగూడెం మండలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అంగేరిగూడెం, అశ్వాపురం పాడు గ్రామాలకు విద్యుత్ మంజూరైంది. విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రి కూడా ఆయా గ్రామాలకు చేరాయి. కానీ అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో విద్యుత్ పనులు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి” అని చెబుతున్నారు ఆ ప్రాంత ఆదివాసీ కార్యకర్త తోలెం రమేష్.

అంటే... వెలుగు రావాల్సిన చోటికి స్తంభాలు వచ్చాయి. సామగ్రి వచ్చింది. కానీ వెలుగు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న ప్రయత్నం ఆ చీకటిలో చిరుదీపంలా నిలిచింది.

తీర్లాపురంలో వెలిగిన వెలుగు

“చీకట్లోనే రాత్రి కాదు... వెలుగు లేని ఇల్లు ఒక చిన్నారి కలల్ని కూడా చీకట్లోనే ఉంచుతుంది.”

ఈ ఆలోచనతో తీర్లాపురం ఆవాసంలో సెప్టెంబర్ 11న సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేసింది పొట్లపల్లి కమల మనోహర రావు ఫౌండేషన్.

“విద్యుత్ సౌకర్యం లేని గిరిజన ఆవాసాల్లో చీకటి పడితే పిల్లల చదువు ఆగిపోతుందని గుర్తించాం. మహిళలు రాత్రివేళ బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఆ చీకటిని తొలగించేందుకు తీర్లాపురంలో సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేశాం. అతి త్వరలో మరిన్ని ఆవాసాల్లో వెలుగులు పంచుతాం” అని ఫౌండేషన్ ఛైర్మన్ పొట్లపల్లి కళాధర రావు తెలిపారు.

ఇది ఒక గ్రామంలో కొన్ని వీధి దీపాలు ఏర్పాటు చేయడం మాత్రమే కావచ్చు. కానీ అక్కడి ప్రజలకు మాత్రం ఇది అంతకంటే చాలా పెద్ద విషయం.

ఎందుకంటే... చీకట్లో జీవించడం అలవాటైపోయిన వారికి వెలుగు ఒక సౌకర్యం కాదు. అది భద్రత. నమ్మకం. స్వేచ్ఛ.

“బల్బ్ చూడటం ఇదే తొలిసారి”

తీర్లాపురం వాసి మిడియం లక్ష్మి మాటల్లో ఆ వెలుగు విలువ ఎంత పెద్దదో తెలుస్తుంది.

“నేను పుట్టినప్పటి నుంచి బల్బ్ ఎట్లుంటదో చూడలేదు. ఇప్పుడు మా గూడేనికి నాలుగు పోలార్ వీధి లైట్లు ఇచ్చారు. పిల్లలు రాత్రులు చదువుకోవడానికి, పెద్దవాళ్లం గ్రామసభలు పెట్టుకోవడానికి, ఆడవాళ్లు అవసరాలకు ఉపయోగపడేందుకు మరికొన్ని సోలార్ లైట్లు కూడా ఇచ్చారు. మా గూడేనికి వెలుగు వచ్చింది. చీకటి నుంచి విముక్తి కలిగించిన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు.”

‘బల్బ్ ఎలా ఉంటుందో చూడలేదు’ అనే ఆ మాట ఒక్కటే... ఈ కథలోని చీకటి ఎంత లోతైనదో చెప్పడానికి చాలు.

ఒక మనిషి ఆలోచన... ఒక సేవా సంస్థగా

ఈ సేవ వెనుక ఉన్న ఆలోచనకు ఒక చరిత్ర ఉంది.

1919 డిసెంబర్ 20న తెలంగాణలోని అశ్వరావుపల్లిలో జన్మించిన పొట్లపల్లి కమలమనోహర్ రావు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ చదువుతున్న సమయంలో ప్రముఖ మానవ శాస్త్రవేత్త క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్-హైమెండార్ఫ్ పరిచయంతో గిరిజన సమాజంపై మరింత లోతైన అవగాహన పెంచుకున్నారు.

గిరిజన జీవన విధానాన్ని దగ్గరగా అధ్యయనం చేసిన హైమెండార్ఫ్ మార్గదర్శకత్వంలో కమలమనోహర్ రావు ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకున్నారు.

అడవుల్లో తరతరాలుగా జీవిస్తూ భూమిపై హక్కులకు, విద్యకు, మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్న ఆదివాసీ సమాజం కోసం కొత్త పరిపాలనా దృక్పథాన్ని నిర్మించేందుకు ఆయన కృషి చేశారు.

1966లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గిరిజన సంక్షేమ శాఖకు తొలి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1995 ఫిబ్రవరి 17న మరణించే వరకు ఆదివాసీల సామాజిక అభివృద్ధి కోసం పనిచేశారు.

ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన కుమారుడు పొట్లపల్లి కళాధర రావు 2016లో పి.కె.ఎం.ఆర్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు.

వెలుగు ఒక్కటే కాదు...

ఫౌండేషన్ సేవలు కేవలం సోలార్ లైట్లకే పరిమితం కాలేదు.

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో ఎంపీ నిధులతో రూ.37 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టింది. జనగామ ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా దండుపల్లి ఆవాసంలోని అంగన్‌వాడీ చిన్నారులకు నోట్‌బుక్స్, స్టేషనరీ అందించింది. అక్కడ కూడా సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

“తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గిరిజన ఆవాసాల్లో విద్య, విద్యుత్, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అక్కడి సమస్యలను రూరల్ మీడియా సంస్థ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, మాకు అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో వీలైనంత సేవ అందిస్తున్నాం. మాకు సాధ్యం కాని పనులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం” అని ఫౌండేషన్ ప్రతినిధి పొట్లపల్లి అనిరుధ్ తెలిపారు.

ఐటీ రంగంలో పనిచేస్తున్న ఆయన తన తోటి ఉద్యోగులు, మిత్రులతో కలిసి ఆదివాసీ పల్లెలను సందర్శిస్తూ అక్కడి సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. అవసరమైన చోట సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు.


ఒక దీపం... ఒక నమ్మకం

ఒక సోలార్ లైట్ ఒక గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించదు.

విద్యుత్ లేని సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వ విద్యుత్ మౌలిక వసతులే. పాఠశాలలు కావాలి. పక్కా భవనాలు కావాలి. పిల్లలకు గుర్తింపు పత్రాలు కావాలి. పై చదువులకు అవకాశాలు కావాలి. వైద్యం, రవాణా, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కావాలి.

అయితే... ప్రభుత్వ పరిష్కారం వచ్చే వరకు ఒక మనిషి చేయగలిగిన చిన్న సహాయం మరొక మనిషి జీవితంలో పెద్ద మార్పుకు నాంది కావచ్చు.

ఒక వీధి దీపం రాత్రి చీకటిని మాత్రమే తొలగించదు.

అది ఒక చిన్నారికి “నేనూ చదువుకోవచ్చు” అనే నమ్మకాన్ని ఇవ్వవచ్చు.

ఒక తల్లికి

“రాత్రయినా నేను బయటకు వెళ్లగలను” అనే భద్రతను ఇవ్వవచ్చు. ఒక గ్రామానికి ‘మేము కూడా వెలుగులో కనిపిస్తున్నాం’ అనే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వవచ్చు. చీకటిలో ఉన్న ఒక గిరిజన ఆవాసానికి వెలుగు అందించడం... నిజానికి ఒక బల్బు ఇవ్వడం కాదు. ఒక రాత్రికి భద్రత ఇవ్వడం. ఒక ఇంటికి నమ్మకం ఇవ్వడం. ఒక చిన్నారికి చదువుకునే అవకాశం ఇవ్వడం. ఒక తరానికి భవిష్యత్తుపై ఆశను ఇవ్వడం. మన చేతుల్లోని చిన్న వెలుగు... వారి జీవితాల్లో పెద్ద మార్పుకు నాంది కావచ్చు. రండి... ఒక్క ఇంటిని వెలిగిద్దాం. ఒక్క వీధిని వెలిగిద్దాం. ఒక తరం భవిష్యత్తును వెలిగిద్దాం.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

శ్యాంమోహన్

Tags

Next Story