సాగర్‌లో నీళ్ళున్నా.. సాగుకు బంద్

సాగర్‌లో నీళ్ళున్నా.. సాగుకు బంద్
X

జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 535 అడుగులు, అయినా ఎడమ కాలువకు నీటి నిలిపివేత

గతంలో అడుగుల స్టోరేజీకి చేరినా పంటలకు నీటి విడుదల

ఎడమ కాలువ పరిధిలో 5.60 లక్షల ఎకరాల్లో వరిసాగు

నీళ్లు వదలకపోతే ఎండిపోయే ప్రమాదం

అడుగంటిన బోర్లు.. పైగా కరెంట్ కోతలు

రాతికింది అంజయ్యగౌడ్:మనతెలంగాణ/ఉమ్మడినల్లగొండ బ్యూరో: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 535.80 అడుగులు(179.6902 టిఎంసిలు).. సాగుకు నీటిని విడుదల చేసే సామర్థం ఉంది.. కానీ ఎడమ కాలువకు నీటిని బంద్ పెట్టారు. ఒకవైపు భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు పనిచేయకపోవడం.. మరోవైపు బావుల్లో నీళ్లు ఇంకిపోవడం.. ఇంకోపు కరెంట్ కోతలు.. వీటికితోడు నీటిని నిలిపివేయడంతో పంట పొలాల్లో కన్నీటి ధారలు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వరి పంట సాగు తగ్గించాల్సి ఉన్నప్పటికీ ఎగువన భారీవర్షాలు కురవడం.. శ్రీశైలం నీటితో నిండిపోవడం.. సాగర్‌కు జలాప్రవాహం పోటెత్తడం.. అడపాదడపా వానలు కురవడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించి పంటలు సాగు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగర్ ఎడమకాలువ ఆయకట్టు పరిధిలో ఏడు లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికిగాను 5.60లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు.

నల్లగొండ జిల్లాలో 2.15 లక్షల ఎకరాలు.. సూర్యాపేట జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకుపైగా పంట సాగైంది. ఒక్కసారిగా ఎడమ కాలువకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టులోని అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కరుకుపొట్టదశలో ఉన్న పంటకు నీళ్లు లేకపోతే ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆరుగాలం శ్రమించి ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట వేస్తే ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోతుండటంతో అన్నదాతల కళ్లలో కన్నీళ్లు చెమ్మగిల్లుతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. వారబంది పద్ధ్దతిలో ఆరుతడులు నీళ్లు ఇస్తే పంటలు గట్టెక్కుతాయని రైతులు పేర్కొంటున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పరిస్థితి తేకుండా సాగర్‌లో ఉన్న నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.

నీరున్నా.. ఎందుకీ పరిస్థితి?

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 535 అడుగులకు పైగానే నీటి నిల్వ ఉంది. సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయొచ్చు. కానీ ఎడమకాలువకు నీటిని బంద్ పెట్టారు. ఆయకట్టు సాగుకు అవసరమైన నీల్లు ఉన్నా నిలిపివేయడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోది. గతంలో 510అడుగులు డెడ్ స్టోరీజీకి నీళ్లు చేరేంత వరకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడారు. ఇప్పుడెందుకు ఇలా జరుగుతోందని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.

మరో రెండు మాసాలు నీళ్లు అవసరం..

వానాకాలం వరి పంట చేతికి రావడానికి మరో రెండుమాసాలు పడుతుంది. నవంబర్ చివరినాటికి పంటలు చేతికి వస్తాయి. అప్పటివరకు నీళ్లు విడుదల చేసి పంటలను కాపాడాలి. ఎల్‌నినో పరిస్థితులతో వర్షాల్లేక బోర్లు ఎండిపోయాయి. గతంలో పోసిన దాంట్లో సగం కూడా బోర్లు పోయడంలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వానాకాలం పంట చేతికి వచ్చేంత వరకు నీటిని ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

వారబందితోనే మేలు..

సాగర్‌లోని నీటినిలువ సామర్థాన్ని బట్టి సాగునీరు నిరంతరంగా ఇవ్వడం కష్టం. కానీ వారబంది పద్ధ్దతిలో నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించి ఇస్తే నీటిని కూడా పొదుపు చేయొచ్చు. వారబంది అంటే వారంరోజులపాటు నిరంతరం నీళ్లు ఇచ్చి మరో వారం రోజులు నీటిని నిలిపివేయాలి. ఆ తర్వాత మళ్లీ నీటిని విడుదల చేయాలి. దీనికి షెడ్యూల్ ఇచ్చి నీటిని ఇవ్వాలి. వారబంది పద్ధతిలో నీళ్లు ఇవ్వడం వల్ల పంటపొలాల్లో నీళ్లు ఉండటమే కాకుండా చెరువులు, కుంటలను నింపడంతో భూగర్భజలాలు పెరిగి బోర్లు కూడా పనిచేస్తాయి. దీంతో నీటిని అవసరం కూడా కొంతమేర తగ్గుతుంది. వారబంది ఇవ్వడమే మేలు.

నీళ్లు లేకపోతే ఎండుడే..

ముందుగా వేసిన వరిపైరు పొట్టదశలో ఉంది. కొంత వెనుక పెట్టిన పొలాలు కరుకుపొట్టదశలో ఉన్నాయి. ఈ దశలో పొలాలకు సమృద్ధిగా నీరుండాలి. అప్పుడే పైరు పటిష్టంగా ఉండి చీడపీడల తాకిడిని ఎదుర్కొని దిగుబడులు ఎక్కువగా వస్తాయి. ఈసమయంలో ఎడమకాలువ ఆయకట్టుకు నీటిని నిలిపివేయంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రూ. వేల పెట్టుబడులు పెట్టి ఈ దశలో పంటలను వదిలివేయలేం.. బోర్లు,బావులతో కొంతమేర కష్టపడ్డా.. సాగర్‌లోని నీటిని దృష్టిలో పెట్టుకొని నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

కెఆర్‌ఎంబి ఆదేశాలు పాటించకుండా నీటి తరలింపు..

కృష్ణమ్మ ఎగువన భారీవర్షాలు కురిసి వరదలు రావడంతో శ్రీశైలం నిండింది.. సాగర్‌కు వరద వచ్చి చేరింది.. సాగర్‌లో 555 అడుగుల మేర నీటి నిల్వ చేరింది.. కానీ అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా నీటిని తరలించాయి. కృష్ణానది యాజమాన్య బోర్డు(కెఆర్‌ఎంబి) ఆదేశాలను బేఖాతరు చేసి ఎవరికి నచ్చినట్లు వారు నీటిని తరలించి వృథా చేశారు. దీంతో ఇప్పుడు నీటినిల్వ తగ్గి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పటికైనా సాగర్ జలాశయంలోని నీటినిల్వ సామర్థాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వాడటంతోపాటు పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags

Next Story