పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మార్పు.. అసెంబ్లీలో తీర్మానం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మార్పు.. అసెంబ్లీలో తీర్మానం
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును ‘పశ్చిమ్ బంగ’గా మార్చే తీర్మానాన్ని వచ్చే నెల 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 4 నుండి 14 వరకు జరగనున్న శీతాకాల సమావేశాల్లో ఈ తీర్మానంతో పాటు మరో ఎనిమిది ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సిఎం తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఆమోదం తర్వాత ఈ ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపుతామన్నారు. కేంద్రం ఆమోదిస్తే ఇంగ్లీషుతో సహా అన్ని ప్రభుత్వ రికార్డుల్లో ‘పశ్చిమ్ బంగ’ అనే పేరునే ఉపయోగిస్తారు. ‘వెస్ట్ బెంగాల్’లోని ‘డబ్ల్యూ’ అక్షరం కారణంగా ఇంగ్లిష్ అక్షరక్రమంలో రాష్ట్రం చివర్లో ఉంటుంది. ఢిల్లీ, ఇతర అఖిల భారత పరిపాలనా సమావేశాల్లో రాష్ట్రాల అక్షరక్రమం ప్రకారం బెంగాల్ ప్రతినిధులకు తరచూ చివర్లో మాట్లాడే అవకాశం వచ్చేది. ఈ సమస్యను పరిష్కరించడమూ తాజా పేరు మార్పు ప్రయత్నం ఉద్దేశాల్లో ఒకటని అధికారులు తెలిపారు.

గతంలో 1999 జూలై 20న వామపక్ష కూటమి ప్రభుత్వం, 2011 సెప్టెంబర్ 2న మమతా బెనర్జీ ప్రభుత్వం ‘పశ్చిమ్ బంగ’ కోసం తీర్మానాలు చేశాయి. ఆ తర్వాత 2016 ఆగస్టు 29న మూడు భాషల్లో మూడు పేర్లను, 2018 జూలై 26న ‘బంగ్లా’ పేరును ప్రతిపాదించినా కేంద్రం ఆమోదించలేదు. బంగ్లాదేశ్ పేరుతో గందరగోళం వస్తుందని, దేశ విభజన చరిత్ర చెరిగిపోతుందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండటంతో ఈసారి ఆమోదం సులభమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags

Next Story