ప్రాణం తీసిన అనుమానం...

ప్రాణం తీసిన అనుమానం...
X

భార్యపై అనుమానంతో గొంతు కోసి, కూతురిని రోకలిబండతో కొట్టి.. భయంతో ఓ వ్యక్తి గొంతు కోసుకున్న సంఘటన సిద్దిపేటలో సంచలనం సృష్టించింది. దుల్మిట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన దున్నపోతుల ఎల్లయ్య, భార్య శ్రీలత (32), కూతురు హర్షిత (16), కొడుకు అజయ్‌లతో కలిసి గత పదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. కాగా కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు బ్రతకడానికి వెళ్లిన అతను పది రోజుల క్రితం మళ్లీ సిద్దిపేటకు వచ్చి ఆదర్శనగర్‌లో కూలి పని చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. కాగా మొదటి నుండి భార్యపై అనుమానంతో ఉన్న అతను ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చి నిద్రలో ఉన్న భార్య శ్రీలతతోపాటు, కూతురు హర్షితల గొంతు కోశాడు. వారు ప్రతిఘటించడంతో ఇంట్లో ఉన్న రోకలిబండలతో వారిని కొట్టి, అనంతరం ఇంకా వారు చావకపోవడంతో, పురుగుల మందులు తాగించాడు.

సంఘటనను గమనించిన కొడుకు అజయ్ ఇంట్లోనుండి పారిపోయి చుట్టు పక్కల వారికి సమాచారం ఇవ్వడంతో, కాలనీవాసులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భయాందోళనకు గురైన ఎల్లయ్య తాను సైతం గొంతు కోసుకొని, ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వారిని హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలోనే శ్రీలత మృతి చెందింది. హర్షిత, ఎల్లయ్యల పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. హర్షిత మిట్టపల్లి కేజీబీవీలో టెన్త్ క్లాస్ చదువుతుండగా, కొడుకు అజయ్ హైదరాబాద్ కీసరలో ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. ఘటన స్థలాన్ని ఎసిపి రవీందర్‌రెడ్డి, టూ టౌన్ సిఐ ఉపేందర్‌లు పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags

Next Story