రీల్ కాదు రియల్‌గా శుభలగ్నం సినిమా రిపీట్... భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య

రీల్ కాదు రియల్‌గా శుభలగ్నం సినిమా రిపీట్... భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య
X

భోపాల్: శుభలగ్నం సినిమాలో భర్తను భార్య కోటి రూపాయలకు అమ్మేస్తుంది. 1990లో ఈ సినిమాకు ఎస్‌వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. అది రీల్‌లో జరిగితే ఇప్పుడు రియల్‌గా జరిగింది. ఓ వ్యక్తి తన కుటుంబాన్ని వదిలి ప్రియురాలితో కలిసి ఉండడంతో భార్య, కూతురు కోర్టుకెక్కింది. దీంతో భర్త తన ప్రియురాలితో కలిసి ఉంటానని తెగేసి చెప్పడంతో కోటిన్నర రూపాయలకు భర్తను ప్రియురాలికి భార్య అమ్మేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఓ న్యాయస్థానంలో జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం... భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి 23 సంవత్సరాల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆఫీసులో పని చేసే మహిళతో పరిచయం పెంచుకొని ప్రేమలో పడ్డాడు. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ప్రియురాలుతో ఉంటూ తన భార్య, పిల్లలను పట్టించుకోకపోవడంతో కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.

తన తండ్రి తనని పట్టించుకోవడంలేదని పెద్ద కుమార్తె కోర్టు మెట్లు ఎక్కింది. ఫ్యామిలీ కోర్టు ప్రియురాలితో పాటు అతడి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్‌కు పిలిచింది. తాను ప్రియురాలితో కలిసి ఉంటానని భర్త స్పష్టం చేయడంతో భార్య ఓ నిర్ణయానికి వచ్చింది. భర్తకు విడాకులు ఇస్తానని, కానీ ప్రియురాలికి ఓ షరతు పెట్టింది. భర్తను వదిలించుకోవాలంటే తనకు కోటిన్నర రూపాయలు ఇవ్వాలని ప్రియురాలిని భార్య డిమాండ్ చేసింది. దీంతో ప్రియురాలు కోటిన్నర ఇస్తానని చెప్పడంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. డూప్లెక్స్ విల్లాతో పాటు రూ.27 లక్షలను ప్రియుడి భార్యకు ప్రియురాలు బదిలీ చేయడంతో వివాదానికి తెరపడింది. తన ఇద్దరు కూతుళ్లతో తల్లి వెళ్లిపోయింది. ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని ప్రియురాలు వెళ్లిపోయింది.

Tags

Next Story