ప్రేమ విఫలం.. మహిళా డాక్టర్ ఆత్మహత్య

ప్రేమించి మోసపోయిన డాక్టర్ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట ఎసిపి రవీందర్‌రెడ్డి తెలిపారు. ఎసిపి తెలిపిన వివరాల ప్రకారం..జోగులాంబ గద్వాల జిల్లా, మానోపాడు మండలం, జల్లాపురం గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబానికి ఎంబిబిఎస్ విద్యార్థిని బి.లావణ్య (23) సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో హౌస్‌సర్జన్‌గా పనిచేస్తోంది. ఆమె ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివి, హైదరాబాద్ గచ్చిబౌలిలో గల గౌలిదొడ్డి క్యాంపస్‌లో ఇంటర్ పూర్తిచేసింది. తొలి ప్రయత్నంలోనే 2020లో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్‌లో చేరింది. ఆమె ట్రాక్ రికార్డ్ ప్రకారంగా చదువు, ఆటలలో చురుకుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. ఆమె అక్క శిరీష హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో జాబ్ చేస్తోంది. లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఈ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్‌గా డాక్టర్ జనరల్ మెడిసిన్ చదువుతున్న సికింద్రాబాద్ లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ప్రణయ్ తేజ్‌తో గత సంవత్సరం జూలైలో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమ బంధంగా మారింది.
వివాహం చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగిన ప్రణయ్ తేజ్, అనంతరం కుల భేదం కారణంగా వివాహానికి నిరాకరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈనెల 3న తీవ్ర మనోవేదనతో మెడికల్ కాలేజీ హోస్టల్ రూమ్‌లో గడ్డి నివారణకు వాడే పారాక్విట్ మందును స్లైన్ ఎక్కించే సూది ద్వారా ఇంజక్షన్ చేసుకోవడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ విషయాన్ని ఆమె రూం మేట్స్ గుర్తించి చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటకు మృతి చెందింది. ఈ విషయమై మృతురాలి అక్క శిరీష ఫిర్యాదు సిద్దిపేట త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తును ప్రారంభించి నిందితుని ఆచూకీ గురించి సిద్దిపేట త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు టీంగా ఏర్పాటు చేసి పంపించగా నిందితుడైన ప్రణయ్ తేజ్ పట్టుకున్నారు. అతనిని విచారించగా, కంసాలి (బి.సి) కులానికి చెందిన వ్యక్తి కాగా మృతురాలు దళిత సామాజిక వర్గానికి చెందినందున సెక్షన్ 108, 69 బిఎన్‌ఎస్ ఎస్‌సి, ఎస్‌టి చట్టం ప్రకారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
-
Home
-
Menu
