అత్యంత ఖచ్చితమైన అణు గడియారం

అత్యంత ఖచ్చితమైన అణు గడియారం
X

ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన అణు గడియారాన్ని (అటామిక్ క్లాక్) సింగపూర్‌లోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్) పరిశోధకులు రూపొందించారు. లూటీషియం అనే అరుదైన మూలకాన్ని ఉపయోగించి ఈ సరికొత్త రికార్డు స్థాయి ఖచ్చితత్వం కలిగిన ఆప్టికల్ అటామిక్ క్లాక్‌ను తయారు చేసినట్టు పరిశోధనా బృందం ప్రకటించింది. ఇది ఒక సెకనులో ట్రిలియన్ వంతు సమయాన్ని అత్యంత ఖచ్చితత్వంలో కొలవగలదని, వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ అత్యంత స్థిరంగా పనిచేస్తుందని వారు తెలిపారు. ఉష్ణోగ్రత, అయస్కాంత క్షేత్రాల్లో మార్పులను కూడా ఇది దాదాపుగా ప్రభావితం కాకుండా తట్టుకోగలదని చెప్పారు.సింగపూర్‌లోని సెంటర్ ఫర్ క్వాంటం టెక్నాలజీస్(సీక్యూటీ) అసోసియేట్ ప్రొఫెసర్ ముగ్రే బారెట్ నేతృత్వంలోని ఈ బృందంలో సీనియర్ రీసెర్ట్ సెంటిస్ట్ కైల్ ఆర్నాల్ట్, పీహెచ్‌డీ విద్యార్థి మైఖేల్ లీ ఉన్నారు.సాధారణంగా అణు గడియారాల్లో సీసియం, స్ట్రోంటియం, వైటెర్బియం వంటి మూలకాలను వాడుతుంటారు.

కానీ ఈ పరిశోధనలో తొలిసారిగా లూటీషియం-176 అయాన్‌ను ఉపయోగించారు. ఇది దట్టమైన, వెండి, తెలుపు రంగులో ఉండే అరుదైన భూమి లోహం. దీని రసాయన సంకేతం ‘ఎల్‌యు’, పరమాణు సంఖ్య 71. తమ గడియారం సెకనులో ఒక ట్రిలియన్ వంతు సమయాన్ని రికార్డు స్థాయి ఖచ్చితత్వంలో కొలవగలదని, ప్రస్తుతం తమ వద్ద ఉన్నదే ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన గడియారం అని తాను నమ్ముతున్నానని ప్రొఫెసర్ ముర్రే బారెట్ తెలిపారు. లూటీషియంలో అగ్రశేణి అణు గడియారాలకు అవసరమైన లక్షణాలున్నాయనే అంచనాతో బారెట్ బృందం దశాబ్దానికి పైగా ఈ మూలకంగా పరిశోధనలు చేస్తోంది. దాని ప్రత్యేక లక్షణాలే ఈ గడియారం అత్యుత్తమ పనితీరుకు కారణమని బారెట్ చెప్పారు. విస్తృతమైన వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక ఖచ్చితత్వాన్ని సాధించవచ్చని, అత్యధిక వేడి ప్రాంతమైన డెత్ వ్యాలీ నుంచి అంటార్కిక్ పీఠభూమిలోని అత్యంత చల్లని ప్రదేశానికి వెళ్లినా లూటీషియం గడియారం స్థిరంగా పనిచేస్తుందని చెప్పారు.

ఇప్పటివరకూ సమయాన్ని కొలిచేందుకు ఈ మూలకంతో పనిచేస్తున్న ఏకైక పరిశోధనా బృందం తమదేనని చెప్పారు. ‘భవిష్యత్తులో ఈ గడియారాన్ని అధిగమించడం ఎలా సాధ్యమవుతుందో నాకు కనిపించడం లేదు’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ తాజా ఆవిష్కరణ భవిష్యత్తులో జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థలను మరింత మెరుగుపరచేందుకు, ‘సెకను’ అంతర్జాతీయ ప్రమాణాన్ని పునర్నిర్వచించడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story