చైనాలో చదువుకోండి.. అమెరికా విద్యార్థులకు జిన్‌పింగ్ ఆఫర్

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా యువతను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఐదేళ్లలో లక్ష మంది అమెరికా యువతను చైనాలో పర్యటించేందుకు, విద్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నట్టు జిన్‌పింగ్ ప్రకటించారు. 2023లో ప్రకటించిన 50 వేల మంది యువత ఆహ్వాన లక్ష్యం నిర్దేశిత గడువుకు ముందుగానే ఈ ఏడాదే పూర్తయిందని తెలిపారు. ఇరుదేశాల మధ్య మైత్రిని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌తో కలిసి చేసిన సంయుక్త ప్రకటనలో జిన్‌పింగ్ పేర్కొన్నారు.‘చైనా, అమెరికా సంబంధాల ఆశ మన ప్రజల్లో ఉంది. వాటి భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది.
వచ్చే ఐదేళ్లలో విద్యా మార్పిడి, పర్యటనల కోసం లక్ష మంది యువ అమెరికన్లను చైనాకు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది’ అని జిన్‌పింగ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చైనా, అమెరికా ప్రజలు ఫాసిస్టు దురాక్రమణకు వ్యతిరేకంగా ‘భుజం భుజం కలిపి’ పోరాడారని, చరిత్రలోని ఆ భాగాన్ని చైనా ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని, అమెరికా ప్రజలు కూడా మర్చిపోలేదని అన్నారు. చైనా దేశం గొప్ప పునరుజ్జీవనాన్ని సాధించడం, అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడం రెండూ కలిసి సాగవచ్చన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దామని, మన చారిత్రక చొరవను ప్రదర్శిద్దామని, మన రెండు దేశాల ప్రజల మధ్య స్నేహాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేద్దామని అన్నారు. కలిసి మెరుగైన ప్రపంచాన్ని నిర్మిద్దామని పేర్కొన్నారు.
ఉమ్మడి ప్రయోజనాలపై దృష్టి : ట్రంప్
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనాకు అమెరికా అందించిన సాయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. భద్రత, సాంకేతికత, సూపర్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన రంగాల్లో తాను, జిన్‌పింగ్ తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల శాంతి, సౌభాగ్యాన్ని ప్రోత్సహించగలవని అన్నారు. ఉమ్మడి ప్రయోజనాలపై ఇరుదేశాలు దృష్టి సారిస్తున్నాయని, చరిత్రలో మనం కలిసి ఎంతో సాధించగలమనే నమ్మకం తనకు ఉందని అన్నారు.
-
Home
-
Menu
