నేత్రపర్వంగా ప్రారంభమైన అధ్యయనోత్సవాలు

శాస్త్రోక్తంగా తిరుమంజనం
మనతెలంగాణ/యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదాద్రి ఆలయ అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన శనివారం ఉదయం ఆలయంలో నిత్యారాధనల అనంతరం తిరుమంజనంను శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. సాయంత్రం నిత్యారాధనల అనంతరం తొళక్కముతో ప్రారంభించి దివ్య ప్రబంధ సేవాకాలమును పారాయణికులు వేదోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహ్మమూర్తి, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ జె.వినోద్‌రెడ్డితో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు అధ్యయనోత్సవాల విశిష్టతను వివరించారు.
28 నుంచి బ్రహ్మోత్సవాలు..
ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశారు. 28న స్వస్తివాచనంతో ప్రారంభంకానున్న ఉత్సవాలు 3వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 30న రాత్రి 7.30 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 31న రాత్రి 7.30 గంటలకు స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణమహోత్సవం, వచ్చే నెల 1వ తేదీన రాత్రి 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవం జరగనున్నట్లు తెలిపారు.
ఉత్సవాల కోసం ప్రత్యేక అధికారి..
పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింస్వామి వారి అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ జి.వినోద్‌రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా శనివారం ప్రారంభమైన అధ్యయనోత్సవాలలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచలు చేశారు.
-
Home
-
Menu
