యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. రెండో శనివారం కావడంతో స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన, శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీనారసింహుడి నిత్యరాబడి : శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి నిత్యరాబడిలో భాగంగా శనివారం రూ.34,24,189 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,78,150, బ్రేక్ దర్శనం ద్వారా రూ.2,88,600, వీఐపీ దర్శనం ద్వారా రూ.4,35,000, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.5,51,500, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.78,632, ప్రసాద విక్రయం ద్వారా రూ.10,14,030, కల్యాణకట్ట ద్వారా రూ.84,000తో పాటు వివిధ శాఖలు, పాతగుట్ట ఆలయం ద్వారా ఆలయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
యాదగిరీశుడి సేవలో గండ్ర : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.
-
Home
-
Menu
