యలహంక ప్యాలెస్ వివాదంలో కోర్టుకెక్కిన జగన్

జగన్, షర్మిల మధ్య యలహంక ప్యాలెస్ వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోకి తన సోదరి షర్మిల ప్రవేశించకుండా స్టే విధించాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్ పేరుతో దేవనహళ్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తన కుమార్తె అంజిలి వివాహ పనుల్లో భాగంగా షర్మిల ఆదివారం యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ ఆమె ప్రవేశాన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే యలహంక ప్యాలెస్‌లో కుమార్తె వివాహం జరిపించాలని షర్మిల భావించినప్పటికీ, జగన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాహ వేదికను మార్చుకున్నారు.
ప్యాలెస్‌లో తాను నివసిస్తున్నందున అక్కడ పెళ్లి నిర్వహిస్తే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని, తన కుటుంబ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని జగన్ గతంలో షర్మిలకు లేఖ రాశారు.మరోవైపు, 2019లో కుదిరిన ఒప్పందం ప్రకారం యలహంక ప్యాలెస్‌పై యాజమాన్య హక్కులు తనకే ఉన్నాయని షర్మిల వాదిస్తున్నారు.ఈ నేపథ్యంలో యలహంక ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు షర్మిల సిద్ధమవడం, ఆమె ప్రవేశాన్ని నిలువరించాలని జగన్ కోర్టును ఆశ్రయించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. దేవనహళ్లి కోర్టు ఈ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
-
Home
-
Menu
