మత్తులో కత్తితో దాడి.. యువకుడి దారుణ హత్య

మత్తులో కత్తితో దాడి.. యువకుడి దారుణ హత్య
X

రెండు గ్యాంగ్‌ల మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు ఓ అమాయక యువకుడి ప్రాణాలను బలిగొన్న ఘటన మామునూరు పరిధిలోని అమ్మవారిపేట తిమ్మాపూర్ ప్రాంతాల్లో కలకలం రేపింది. మేకల గౌతం(24) అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. పవన్, జానకిరామ్ ఇద్దరూ కలిసి ముఠాగా ఏర్పడి నిర్మానుష్య ప్రాంతాల్లో తిరిగే విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని వారిని బెదిరించి వీడియోలు చిత్రీకరించి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గిరిధర్‌కు పవన్, జానకి రామ్‌లతో మనస్పర్థలు ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. గిరిధర్‌కు మద్దతుగా నిలిచిన అతని బాబాయి మేకల గౌతమ్‌ను రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు పిలిపించి

నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ పవన్, జానకి రామ్‌లతో ఘర్షణ చోటు చేసుకోగా.. ఇద్దరూ కలిసి గౌతమ్‌పై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పొట్ట, ఛాతీపై తీవ్ర గాయాలు కావడంతో గౌతమ్ పరిస్థితి విషమించిందని తెలిపారు. ఈ ఘటనతో గౌతమ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై నిందితులు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని, నిందితులకు చట్ట ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. రెండు గ్యాంగ్‌ల మధ్య ఉన్న విభేదాలు, హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితులపై ఉన్న ఆరోపణలపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.

Tags

Next Story