రిజర్వ్ ఫారెస్టులో యువకుడి దారుణ హత్య

రిజర్వ్ ఫారెస్టులో యువకుడి దారుణ హత్య
X

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని చింతలకుంట రోడ్డు ప్రక్కన రిజర్వ్ ఫారెస్టులో ఒక యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. సిఐ టంగుటూరి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బలిగేర గ్రామానికి చెందిన ఎస్ తిమ్మప్ప అలియాస్ ఖయ్యూం (28) అనారోగ్యం కారణంగా రాయచూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని ఈ నెల 4వ తేదీన పరామర్శించి అదేరోజు ఉదయం 10 గం.లకు తిరుగు ప్రయాణం అయ్యాడు. తాను చింతలకుంట గ్రామం మీదుగా వస్తున్నానని, బస్టాండ్‌కు రమ్మని తన తండ్రి సనక దేవన్నకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే, గంటన్నర సమయం అయినా తిరిగి రాకపోవడంతో కుమారుడి మొబైల్ నెంబర్‌కు తండ్రి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌లో ఉంది. రాత్రి లోపు ఇంటికి చేరుకుంటాడడులే అనుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. సోమవారం కూడా కుమారుడు ఇంటికి రాకపోవడంతో మరో కుమారుడైన యేసు,

మరో ఇద్దరి పిల్లలతో కలసి చింతలకుంట రోడ్డు పక్కన ఉన్న ముసలన్‌దొడ్డి రిజర్వ్ ఫారెస్టులో ఉదయం 6 గం.ల సమయంలో గాలింపు చేపట్టారు. ఒక చెట్టు కింద కుమారుడు విగతజీవిగా పడిఉండడడాన్ని గమనించి దగ్గరకు వెళ్ళి చూడగా తల వెనుక భాగంలో బండరాయితో కొట్టి చంపారని గుర్తించి స్థానిక పోలీస్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ కెటి మల్లేష్‌తో కలసి పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా, తన కుమారుడి మృతిపై మిట్టదొడ్డి గ్రామానికి చెందిన అబ్రహం అనే వ్యక్తిపై అనుమానం ఉందని, అతనిని విచారించి, చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. హత్య కేసుకు సంబంధించి ఆధారాలను సేకరించడం కోసం జాగిలాలతో గాలింపు చేపట్టామని కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని సిఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.

Tags

Next Story