నామినేషన్ వేసిన యువకుడు.. ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య

నామినేషన్ వేసిన యువకుడు.. ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య
X

పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా నామినేషన్ వేసిన యువకుడు ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలం, కంసాన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, రైల్వే ఎస్‌ఐ రాజు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామంలోని 4వ వార్డు మెంబర్‌గా ఆవ శేఖర్ (24) నామినేషన్ వేశాడు. ఇదే వార్డులో ప్రత్యర్ధులు కంది యాదయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే, నామినేషన్‌ను విత్ డ్రా చేసుకోవాలని కంది యాదయ్య గౌడ్ అనే వ్యక్తి అతనిపై ఒత్తిడి చేశాడు. విత్ డ్రా చేసుకోకపోతే అంతు చూస్తానంటూ తప్పుడు కేసులు పెట్టిస్తానంటూ బెదిరించాడు. ఈ ఒత్తిడిని తాళలేక మనస్తాపం చెందిన శేఖర్ మంగళవారం అర్ధరాత్రి షాద్‌నగర్ పట్టణ పరిధిలోని రైల్వేపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. శేఖర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. శేఖర్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Tags

Next Story