ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో యువకుడి జలదీక్ష

పొంగుతున్న వాగుపై రైతులు, గ్రామస్తులు, భక్తులు రాకపోకలకు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఓ యువకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ యువకుడు పొంగిపొర్లుతున్న వాగులో ప్రజా గర్జన నిరసన జల దీక్షను చేపట్టిన ఘటన గురువారం నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలోని పసువుల వాగులో గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఆకునమోని చంద్రయ్య యాదవ్ ప్రజా గర్జన నిరసన జలదీక్ష చేపట్టారు. గ్రామ సమీపంలో ఉన్న పసువుల వాగు పొంగిపొర్లుతుంది. వారం రోజుల నుంచి పొలాలకు రైతులు, కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు వెళ్లకుండా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొంగుతున్న వాగును దాటడానికి వీలు కాకపోవడంతో పంటపొలాలు, సోమశిల లింక్ రోడ్డు,గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయానికి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి.
రామాపూర్ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఆకునమోని చంద్రయ్య యాదవ్ ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పరిష్కరించాలని కోరుతూ ఉధృతంగా పొంగుతున్న వాగులో జలదీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు గ్రామస్తులు సంఘిభావం పలికారు. వరదలో వైకుంఠదామం షెడ్లు మునిగిపోయిందని ఆ గ్రామస్తులు వాపోయారు. గత నెల రోజుల క్రితం గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే నానా అవస్థలు పడుతూ అతి కష్టం మీద వాగు దాటి అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. వర్షం కాలంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శవాన్ని ఎత్తుకొని వాగు దాటాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోయారు. వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని దీక్ష చేపట్టిన ఆకునమోని చంద్రయ్య యాదవ్ కోరారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు తాను జలదీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
-
Home
-
Menu
