ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో దాడి

ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో దాడి
X

సూర్యాపేట జిల్లాలో ఓ ప్రేమ ఉన్మాది దారుణానికి తెగబడ్డాడు.గత కొంతకాలంగా ప్రేమించి దూరం పెడుతుందని యువతిపై తన ప్రియుడు సుత్తితో దాడి చేసిన సంఘటన గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్నేహనగర్ లో చోటు చేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరిస్తోందని ప్రియురాలిపై సుత్తితో దాడి చేశాడు.యువతిపై దాడి చేయడంతో యువతి కేకలు విని స్థానికులు వచ్చి నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేశ్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకునే సమయంలో నుతనకల్ మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల పెళ్లి ప్రస్తావన రావడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. నెల రోజుల క్రితం పెద్దల సమక్షంలో కూర్చిపెట్టి మాట్లాడారు. అప్పటి నుంచి యువతి సూర్యాపేటలోని బంధువులు ఇంట్లో ఉంటుంది. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్నేహనగర్ లో ఉన్న యువతిపై ప్రియుడు దాడి చేశాడు.

సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన పట్టేటి స్పందన పై లింగంపల్లి గ్రామానికి చెందిన బోయిన్ల మహేష్ దాడికి పాల్పడినట్లు తెలిపారు. స్పందన స్నేహ నగర్ లో నివాసం ఉంటున్న తన అక్క బావ ఇంటికి గత రెండు రోజుల క్రితం వచ్చింది. గురువారం ఉదయం 09.15 గంటల సమయములో స్పందన ఒక్కతే ఇంటిలో ఉండడం చూసి పథకం ప్రకారం దాడి చేసినట్లు తెలిపారు. మహేష్ స్పందన పై పథకం ప్రకారం షాపు యందు ఇనుప సుత్తె కనుగోలు చేసి ఆమె దగ్గరికి వెళ్ళి వారి ప్రేమ విషయమై అమెతో గొడవ పడి తన వద్ద యున్న సుత్తె తో తలపై కొట్టి గాయపర్చనట్లు పోలీసులు పేర్కొన్నారు. స్పందన కేకలు విని చుట్టు పక్కల వారు వచ్చి ఆమెను కాపాడారని, స్పందనను చికిత్స నిమిత్తం సూర్యపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ యందు చేర్పించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్ కు వెళ్ళి స్పందన బావ పూల బాబురావు నుండి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు డి.ఎస్.పి ప్రసన్న కుమార్ తెలిపారు. సంఘటన వద్ద సూర్యాపేట రూరల్ జి. రాజశేఖర్ , చివ్వెంల యస్.ఐ వి. మహేశ్వర్, క్లూస్ టీం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story