ఫలించని ప్రేమ పోరాటం

మూడు నెలలుగా ప్రేమ పోరాటం చేస్తున్న యువతి ప్రియాంక (29) చివరికి సూసైడ్ చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, చిన్నపల్లి గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలానికి చెందిన రాంబాబు, ఆదిలక్ష్మి కూతురు ప్రియాంక గట్టు మండలం, చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునందన్ గౌడ్ హైదరాబాద్‌లో జాబ్ ప్రిపేరేషన్ టైంలో ప్రేమించుకున్నారు. అనంతరం రఘునందన్ గౌడ్ పోలీస్‌గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రేమ పెళ్లికి రఘునందన్ గౌడ్ నిరాకరించడంతో ఆమె జులై 17న గద్వాల జిల్లాకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మోసం చేసిన కానిస్టేబుల్‌ను రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆమె చిన్నోనిపల్లి లోని ప్రియుడు ఇంటి ముందు ప్రేమ పోరాటం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో శుక్రవారం ప్రియుడు ఇంటి ముందు ఎలకల మందును కూల్ డ్రింక్‌లో కలుపుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హాస్పిటల్ దగ్గర ధర్నా నిర్వహించి నిందితుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేవరకు పోస్టుమార్టం చేయనీయబోమని తెగేసి చెప్పారు. డిఎస్‌పి మొగులయ్య, సిఐ శీను అక్కడికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులకు కఠినంగా శిక్షపడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. శనివారం రాత్రి పోస్ట్‌మార్టం కోసం ఏర్పాట్లు చేశారు.
ఎవరినీ ఉపేక్షించేది లేదు: ఎస్‌పి శ్రీనివాసరావు
ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్‌పి శ్రీనివాసరావు తెలిపారు. గట్టు పోలీస్ స్టేషన్లో ప్రియాంక ఫిర్యాదు మేరకు రఘునాథ్ గౌడ్‌పై కేసు నమోదైందని అన్నారు. ప్రియాంక మృతికి కారణమైన వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, రఘునాథ్ గౌడ్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Tags
-
Home
-
Menu
