ఎఐకి గూడు కడుతున్న మానవ మేధ!

ఎఐకి గూడు కడుతున్న మానవ మేధ!
X

Human brains are building the foundation for code writing AI

మన తెలంగాణ/స్పెషల్ డెస్క్ : కృత్రిమ మేధ (ఏఐ) అంటే ఇప్పటివరకు మన కళ్ల ముందు కనిపించిన దృశ్యం.. కంప్యూటర్ ముందు కూర్చున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్, చేతిలో ల్యాప్‌టాప్, తెరపై కోడ్. కానీ ఏఐ విప్లవానికి మరో కోణం కూడా ఉంది. అక్కడ కోడ్ రాసేవాళ్ల కంటే ముందుగా విద్యుత్ తీగలు అమర్చేవాళ్లు, కూలింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసేవాళ్లు, భవనాలు నిర్మించేవాళ్లు అవసరం. ఏఐ మోడళ్లకు కావాల్సిన భారీ కంప్యూటింగ్ సామర్థ్యం కోసం అమెరికాలో డేటా సెంటర్ల నిర్మాణం ఊపందుకోవడంతో ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు, హెచ్‌వీఏసీ టెక్నీషియన్లు, ఇతర నైపుణ్య కార్మికులకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. చాట్‌బాట్‌లో ఒక ప్రశ్న అడిగితే క్షణాల్లో సమాధానం వస్తుంది. కానీ ఆ సమాధానం వెనుక వేలాది కంప్యూటర్లు, వాటిని నడిపించే విద్యుత్, వేడిని తొలగించే కూలింగ్ వ్యవస్థలు, నెట్‌వర్క్‌లు, బ్యాకప్ పవర్ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. అందుకే ఏఐ సంస్థలు డేటా సెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఈ భవనాల్లో విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి నిపుణులైన ఎలక్ట్రీషియన్లు, నిర్మాణ పనులకు కార్పెంటర్లు, పైపింగ్, కూలింగ్ కోసం ఇతర సాంకేతిక కార్మికులు అవసరం. ఇండీడ్ హైరింగ్ ల్యాబ్ సర్వే ప్రకారం అమెరికాలో డేటా సెంటర్‌కు సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు గత రెండేళ్లలో రెండింతలకు పైగా పెరిగాయి. ఈ ప్రకటనల్లో సుమారు నాలుగోవంతు ఇన్‌స్టలేషన్, నిర్వహణకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉన్నాయి. ఈ విభాగంలోని కార్మికులకు సాధారణ ఉద్యోగాలతో పోలిస్తే గంటకు సగటున 42 శాతం అధిక వేతనం లభిస్తున్నట్లు సంస్థ విశ్లేషణ చెబుతోంది.

కార్మికుల కోసం ఏఐ సంస్థల శిక్షణ

నైపుణ్యం కలిగిన కార్మికులు దొరకకపోవడంతో టెక్ కంపెనీలు వారిని తయారు చేసేందుకు శిక్షణలోనూ పెట్టుబడులు పెడుతున్నాయి. ఉదాహరణకు, ఇంటర్నేషనల్ బ్రదర్‌హుడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ భాగస్వామ్యంతో గూగుల్ సంస్థ సుమారు 50 మిలియన్ డాలర్ల ఖర్చుతో భారీ శిక్షణ కార్యక్రమం చేపట్టింది. మెటా కూడా నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ ఇచ్చేందుకు మొదటి ఏడాదిలో 115 మిలియన్ డాలర్లు కేటాయించి సుమారు 5,000 మందికి శిక్షణ ఇవ్వనుంది. డేటా సెంటర్ల కోసం నైపుణ్య కార్మికులను భారీగా ఆకర్షించడం వల్ల ఇతర నిర్మాణ రంగాలకు కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అమెరికా నిర్మాణ రంగంలో ఇప్పటికే సుమారు 4.39 లక్షల మంది కార్మికుల కొరత ఉందని అంచనా. ఇది భారతదేశానికీ ఒక ముఖ్యమైన సంకేతం. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతులు, డిజిటల్ సేవల పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, నిర్వహణ వంటి నైపుణ్యాలకు భవిష్యత్తులో ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. ఏఐ ఉద్యోగ అవకాశాలను కొల్లగొడుతుందనే భయాందోళనలు నెలకొన్న వేళ, ఏఐ కోసం మరింత మంది మనుషులను ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి వస్తోంది. ఏఐ మెదడును తయారు చేస్తోంది టెక్నాలజీ.. కానీ ఆ మెదడుకు ఇల్లు కడుతున్నది మాత్రం మనిషి చేతులే!

Tags

Next Story