సకాలంలో వైద్యం అందక గిరిజన మహిళ మృతి

సకాలంలో వైద్యం అందక గిరిజన మహిళ మృతి
X

గర్భస్రావం జరిగి సకాలంలో వైద్యం అందక ఓ గిరిజన మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండలంలో కుమురం బీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వాంకిడి మండలంలోని చిచ్చుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల మారుమూల గ్రామం ఖాతిగూడకు చెందిన మడావి మారుబాయి (21)కి ఆత్రం సునీల్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఖాతిగూడలోని తన తల్లిగారి ఇంట్లోనే ఉంటూ దంపతులిద్దరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఎనిమిది నెలల గర్భంతో ఉన్న మారుబాయికి గత నాలుగు రోజుల క్రితం గర్భ స్రావం జరిగింది. ఇంట్లోనే గర్భస్రావం కాగా తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దీంతో సోమవారం మారుబాయి అస్వస్థతకు గురి కాగా 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. గుట్టపైన ఉన్న ఖాతిగూడ గ్రామానికి రోడ్డు మార్గం లేని కారణంగా చొపనూడ వద్దనే అంబులెన్స్ను నిలిపేశారు. కుటుంబ సబ్యులు కలిసి మారుబాయిని ఎత్తుకుని అంబెలెన్స్ వరకు తీసుకు వచ్చారు.

అక్కడి నుంచి మండల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు ఆసిఫాబాద్కు తీసుకెళ్ళాల్సిందిగా సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మద్యాహ్నం మార్గ మద్యలో మృతి చెందింది. కాగా గత ఆగష్టు నెలలో మండలంలోని గోందాపూర్ గ్రామానికి చెందిన దేవబాయి అనే గిరిజన బాలింత సకాలంలో వైద్యం అందక రక్తహీనతతో మృతి చెందిన విషయం తెలిసిందే.. మూడు నెలలు గడవక ముందే మరో గిరిజన మహిళ సకాలంలో వైద్యం అందక మృతి చెందడం శోచనీయంగా మారింది. రహాదారి సౌకర్యం లేని కారణంగానే ఆంబులెన్స్. గ్రామం వరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. పర్యావసనంగా అత్యవసర సమయంలో వైద్యానికి నోచుకోలేక ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. |

Tags

Next Story