ఆర్‌ఎస్‌ఎస్ @100

వందేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)తో పోల్చదగిన మరో సంస్థ కనిపించదు. వేల సంవత్సరాల భారతీయ సామాజిక విలువలను వర్తింప చేసుకుంటూ, కాలగమనంలో సమాజ జీవనంలో ఏర్పడిన లోటుపాట్లను అధిగమిస్తూ ఓ దృఢమైన జీవనాన్ని ఏర్పాటు చేస్తూ, అందుకోసం తన జీవితాన్ని అంకితం చేయగల విధంగా ప్రజలను నడిపించే విధంగా విలక్షణమైన ఓ కార్యపద్ధతిని ఏర్పర్చుకుంది. ఓ నాగరిక దేశంగా గుర్తింపు పొందిన భారత జాతికి పునాదిగా ఉన్న సంస్కృతి మూలాలనుండి జాతీయవాదం ఉద్భవించింది. అయితే, దురదృష్టవశాత్తు స్వాతంత్య్ర పోరాటానికి ముందు, పోరాట సమయంలో, తర్వాత జరిగిన అన్ని పరిణామాలలో సంస్కృతి కేంద్రీకృత విలువలను తిరస్కరించడం ఓ పరిపాటిగా మారింది. ఈ తిరస్కరణ ప్రమాదకరమైన ప్రభావంతో చరిత్రను వక్రీకరించడం, సంప్రదాయాలను తప్పుగా అర్థం చేసుకోవడం, భారతదేశం ఎప్పుడూ ఒక దేశం కాదని చూపించడానికి విచ్ఛిన్న అనుకూల సిద్ధాంతాలను తయారు చేయడం ద్వారా జాతీయవాదంను పక్కకు నెట్టివేసి ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి.
దేశభక్తిని అస్పష్టమైన, ఇరుకైన, కాలం చెల్లిన ఆలోచనగా కనిపించేలా చేసే ప్రయత్నాలు జరిగాయి. పర్యవసానంగా, ఒక సాధారణ నైతికతను పంచుకోవడానికి మనకు సహాయపడే భావోద్వేగ అంశం దాదాపు బలవంతంగా ఆవిరైపోయే పరిస్థితి ఏర్పడింది. భారతదేశం అసలు ఓ సమైక్య దేశం కాదని, రాష్ట్రాల సమ్మేళనం అని, భారతదేశ పటం కృత్రిమంగా కలిసి కుట్టిన అనేక రాష్ట్రాల ముక్కలతో తయారు చేసిందని చాలామంది నమ్మించే ప్రయత్నాలు చేశారు. ఈ ఆటుపోట్లకు వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా ఈదుతూ, ప్రజల దైనందిన జీవనంలో జాతీయత, దేశభక్తిని ప్రతిబించించే విధంగా ఓ తపస్సు మాదిరిగా మహోద్యమంగా ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తూ వచ్చింది. భారతదేశ పునాది సంస్కృతి గురించి గుర్తు చేస్తూనే, జాతీయ సమైక్యత, నైతిక విలువలు, సామాజిక సామరస్యం వంటి అంశాలపై ప్రజలను మేల్కొల్పడానికి ఒక శతాబ్ద కాలంగా కృషి చేస్తూ వస్తున్నది. ఈ కృషి కారణంగా నేడు దేశభక్తి ఒక ప్రాథమిక విలువగా అభివృద్ధి చెందింది. అనేక లక్షల మంది కలిసి పనిచేయడానికి, కలిసి ఉండటానికి ప్రేరేపిస్తుంది. దేశభక్తి కేవలం జెండా ఎగురవేయడం, దేశభక్తి గీతాలు పడటం లేదా జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయడం మాత్రమే కాకుండా, తమ రోజువారీ ప్రవర్తనలో ప్రతిబింబించాలని గ్రహించేలా ప్రజలకు అవగాహన కలిగిస్తూ వస్తుంది. స్వాతంత్య్రం ముందు కాలం నుండి ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్, ఆ తర్వాత సంఘచాలక్ గురు గోల్వాల్కర్ దేశ సమగ్రత కాపాడేందుకు విశేషంగా కృషి చేశారు.
పండిట్ నెహ్రు ధోరణి పట్ల విసుగుచెంది, జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు విముఖంగా ఉన్న రాజాహరి సింగ్‌ను ఉప ప్రధాని సర్దార్ పటేల్ కోరడంతో స్వయంగా గురూజీ కలిసి, విలీనానికి ఒప్పించారు. ఆర్‌ఎస్‌ఎస్ కేవలం ఓ సాంస్కృతిక, సామాజిక సంస్థ మాత్రమే కాదు, అవసరమైన్నప్పుడు దేశంకోసం, దేశ ప్రజల కోసం ఎటువంటి పోరాటాలకైనా వెనకడుగు వేయబోదని స్పష్టమైన సంకేతం అత్యవసర పరిస్థితి సమయంలో ఇచ్చింది. సరిగా 50 ఏళ్ళ క్రితం దేశంలో ప్రజాస్వామ్య హక్కులనుహరిస్తూ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి శకాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో మొదటిసారి ప్రజల ప్రాథమిక హక్కులను తొలగించారు. పత్రికా స్వాతంత్రంపై గొడ్డలిపెట్టు అన్నట్టు సెన్సార్ షిప్ అమలు జరిపారు. దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించాక ఇందిరాగాంధీ నిషేధించిన తొలి ప్రజా సంస్థ ఆర్‌ఎస్‌ఎస్.1975 జూన్ 30న నాటి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవ్‌స్‌న్రు అరెస్టు చేశారు.
1975 జులై 4న ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారు.దీంతో ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకుల ఇళ్లే ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి కేంద్రాలుగా మారాయి. దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాల నేతలు జైళ్లకు, ఇళ్లకు పరిమితమైనప్పుడు, నిత్యం పోరాటాలతో వీధులలో ఉండే వామపక్షాలు కూడా నిస్సహాయంగా మిగిలిన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద నిరసన ఉద్యమం నిర్వహించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ను కొన్ని మతాలకు వ్యతిరేకమైన సంస్థగా చిత్రీకరించే ప్రయత్నం మొదటినుండి జరుగుతుంది. అయితే, హిందువులు, ముస్లింల డిఎన్‌ఎ ప్రస్తుత సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి, సహాయ కార్యక్రమాలను నిర్వహించడానికి, పేద పిల్లలకు విద్య, వైద్య సదుపాయాలు అందించడానికి, వృద్ధులకు సేవ చేయడానికి స్వయంసేవక్‌లు అందించే సేవలలో మత విచక్షణ అనేది మచ్చుకైనా కనిపించదు. అందుకనే శక్తివంతమైన, సౌభాగ్యవంతమైన భారతదేశ నిర్మాణంకోసం ప్రజలందరినీ కలిపి ఉంచేవిధంగా ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఆధునిక భారత చరిత్ర రూపురేఖలనే మార్చివేయగలవు.
చలసాని నరేంద్ర, 98495 69050
Tags
-
Home
-
Menu
