కాంగ్రెస్‌పై హరీష్ రావు విషం చిమ్ముతున్నారు: అడ్లూరి లక్ష్మణ్

దండుపాళ్యం బ్యాచ్ అంటూ మాట్లాడడం సబబు కాదు
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు బాధ్యత కాంగ్రెస్‌దే
బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా?
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు అబద్ధపు ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్నారని ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోహినిపుర వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న అనంరతం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చకు రాని మాటలు మాట్లాడారని హరీశ్‌రావు అనడం సబబు కాదని అన్నారు. మంత్రివర్గ సమావేశంపై అనుచితంగా మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
20 నెలల కాంగ్రెస్ పాలనపై బిఆర్‌ఎస్ నాయకులకు ఇంత ఆక్రోషం ఎందుకని మండిపడ్డారు. ప్రజా పాలనలో తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను సక్రమంగా అందిస్తోందని, ఇకపై కూడా ప్రజలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందని అన్నారు. ‘పదేళ్ల రాష్ట్ర ప్రజలకు మీరేం చేశారో.. 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో సచివాలయం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావాలి’ అని సవాల్ హరీశ్‌రావుకు విసిరారు. మాజీ సిఎం కెసిఆర్ చర్చకు వస్తే తమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తారని, లేదంటే హరీశ్‌రావుకు తాను చర్చకు సరిపోతానని పేర్కొన్నారు. గత సర్కార్ చేసిన అప్పులకు ఇపుడు తమ ప్రభుత్వం వడ్డీలు కడుతూనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాదిరిగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటోందని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన హరీశ్‌రావు తమ మంత్రి వర్గాన్ని దండుపాళ్యం బ్యాచ్ అనడం సరికాదని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో త్వరలోనే తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గంప మహేందర్, గూడూరి శ్రీనివాస్, దరిపల్లి చంద్రం, సాకి ఆనంద్, బొమ్మల యాదగిరి, మార్క సతీష్ తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
