కొండా సురేఖకు అచ్చిరాని మంత్రి పదవి!

కొండా సురేఖకు అచ్చిరాని మంత్రి పదవి!
X

సీనియర్ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖకు మంత్రి పదవి అచ్చిరావడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రెండుసార్లు మంత్రి పదవి చేపట్టిన ఆమె.. రెండుసార్లూ పూర్తికాలం కొనసాగకుండానే పదవికి దూరమయ్యారు. తొలిసారి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో చేరిన ఆమె ఏడాదికే మంత్రి పదవిని కోల్పోగా.. 13 ఏండ్ల తర్వాత మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేండ్లకే పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1999లో శాయంపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన సురేఖ.. 2004లోనూ అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో పరకాల నుంచి గెలిచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే వైఎస్‌ఆర్ ఆకస్మిక మరణం, అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆమె మంత్రిగా కొనసాగలేకపోయారు.

తర్వాతి రాజకీయ ప్రస్థానంలో పలు పార్టీల్లో కొనసాగిన సురేఖ.. 2014లో టిఆర్‌ఎస్ నుంచి వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్‌లో చేరి పరకాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2023లో తిరిగి వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి.. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మంత్రి హోదాలో ఉన్న సమయంలో కొండా సురేఖ పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. తాజాగా ఆమె కుటుంబానికి సంబంధించిన రాజకీయ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇలా రాజకీయంగా సుదీర్ఘ ప్రస్థానం ఉన్న సురేఖకు రెండుసార్లు మంత్రి పదవి దక్కినా.. రెండుసార్లూ అనూహ్య పరిణామాలే పదవిని దూరం చేశాయి. దీంతో మంత్రి పదవి సురేఖకు నిజంగానే అచ్చిరావడం లేదా? లేక ప్రతిసారీ పరిస్థితులే ప్రతికూలంగా మారుతున్నాయా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Tags

Next Story