పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు!

పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు!
X

CPS రద్దు చేసి OPS పునరుద్ధరించాలి

– TGEJAC జిల్లా చైర్మన్‌ మందడి ఉపేందర్‌రెడ్డి

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఉద్యోగుల భవిష్యత్‌ ఆర్థిక భద్రతను ప్రశ్నార్థకం చేసే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (CPS)ను తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం (OPS)ను పునరుద్ధరించాలని TGEJAC యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్‌ మందడి ఉపేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని IDOC వద్ద ఉద్యోగులు ‘పెన్షన్‌ విద్రోహ దినం’ నిర్వహించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ జీవితంలో విలువైన సంవత్సరాలను ప్రజాసేవకు అంకితం చేస్తున్నారని, పదవీ విరమణ అనంతరం వారికీ, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత “పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు” అని స్పష్టం చేశారు. CPS విధానం ఉద్యోగుల భవిష్యత్‌ను అనిశ్చితిలోకి నెడుతోందని, అందువల్ల ఎలాంటి జాప్యం లేకుండా CPSను రద్దు చేసి OPSను పునరుద్ధరించాలని కోరారు.

పెండింగ్‌ సమస్యలకు పరిష్కారం ఏదీ?

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని TGEJAC నాయకులు డిమాండ్‌ చేశారు. 2వ PRC అమలు, పెండింగ్‌లో ఉన్న DAల విడుదల, సమర్థవంతమైన EHS–క్యాష్‌లెస్‌ వైద్య పథకం అమలు, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు, GO 317 బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను కాలయాపన చేయకుండా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

“మేం అడుగుతున్నవి ప్రభుత్వ కానుకలు కావు.. ఉద్యోగులకు దక్కాల్సిన న్యాయమైన హక్కులు. ఉద్యోగుల ఐక్యతే మన బలం.. హక్కుల సాధనే మన లక్ష్యం” అని ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

చలో హైదరాబాద్‌కు తరలిరావాలి

రాబోయే ‘చలో హైదరాబాద్‌–ఉద్యోగుల హక్కుల సాధన సభ’ను విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్‌ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో TGEJAC జిల్లా కార్యవర్గ సభ్యులు ధరణికోట భగత్‌, ముక్కెర్ల యాదయ్య, చిగురి జగన్‌, ఎం.డి. ఖదీర్‌, కంచనపల్లి శ్రీకాంత్‌, పెండం శ్రీనివాస్‌, గణగాని శశికాంత్‌గౌడ్‌, పాదూరి శ్రీకాంత్‌రెడ్డి, మొరిగాడి దీనకర్‌, కల్లూరి రమేష్‌, నాయిని లక్ష్మీనరసింహారెడ్డి, కేతావత్‌ రవీందర్‌నాయక్‌, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, తప్రా బాలరాజుగౌడ్‌, MRO కృష్ణ, నల్ల కృష్ణ, రమణ, వి.శ్రీనివాస్‌రెడ్డి, పి.శ్రీనివాస్‌, ఎం.డి.జానీ, డాక్టర్‌ రమేష్‌, డాక్టర్‌ గోపిరెడ్డి, కె.సురేష్‌, ఎస్‌.హెచ్‌.లక్ష్మి, శ్రీశైలం, గడ్డం బాలస్వామి, అనిల్‌, డి.కవిత తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story