పింఛను ఇప్పించండి మహాప్రభు..!

27 సంవత్సరాలుగా మంచానికే పరిమితం ఆయన మహిళ.
బతుకుదెరువు కోసం ముంబాయి వెళ్లి పనిచేస్తున్న సమయంలో
కింద పడడంతో చచ్చుబడిపోయిన కాళ్లు
భార్యను చూసుకునే భర్త నాగప్ప కూడా కొన్ని నెలలుగా
అనారోగ్యంతో మంచానికి పరిమితం
గతంలో ఎంపీ రంజిత్ రెడ్డి చొరవతో మంజూరైన వికలాంగ పెన్షన్
మంజూరైన కొన్ని రోజులకే ముగిసిన సర్టిఫికెట్ వ్యాలిడిటీ
పలుమార్లు సదరం క్యాంపుకు వెళ్లినప్పటికీ వైద్య పరీక్షల పేరుతో దాటవేస్తున్న అధికారులు
దీనస్థితికి చేరిన కుటుంబ పరిస్థితి.. అధికారులు చొరవచూపి పింఛను ఇప్పించాలని వేడుకుంటున్న నిరుపేద మహిళ జయమ్మ
మన తెలంగాణ/బంట్వారం : మండల కేంద్రానికి చెందిన మైసగళ్ళ జయమ్మ భర్త నాగప్ప అనే దంపతులు బతుకుదెరువు కోసం ముంబయికి వెళ్లి పని చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడటంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయి గత 27 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన నిరుపేద మహిళ పింఛన్ కోసం ఎదురుచూస్తోంది. తనకు ప్రభుత్వం అందించే వికలాంగ పింఛన్‌ను పునరుద్ధరించి ఆదుకోవాలని ఆమె అధికారులను వేడుకుంటోంది. కుటుంబ పోషణ కోసం ముంబయికి వెళ్లి పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడటంతో జయమ్మ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమైంది. దీంతో కుటుంబ జీవనం పూర్తిగా భారంగా మారింది.
ఇదిలా ఉండగా, ఆమెను చూసుకుంటున్న భర్త కూడా గత కొన్ని నెలలుగా అనారోగ్యానికి గురై మంచానికే పరిమితం కావడంతో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గతంలో అప్పటి ఎంపీ రంజిత్‌రెడ్డి చొరవతో ఆమెకు వికలాంగ పింఛన్ మంజూరైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పింఛన్ మంజూరైన కొద్దికాలానికే సదరం సర్టిఫికెట్ గడువు ముగియడంతో పింఛన్ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సదరం సర్టిఫికెట్ కోసం పలుమార్లు క్యాంపులకు వెళ్లినా వైద్య పరీక్షలు, ఇతర కారణాలతో అధికారులు దాటవేస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 27 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన తన పరిస్థితిని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, మానవతా దృక్పథంతో స్పందించాలని కోరుతున్నారు. ప్రస్తుతం కుటుంబానికి సరైన ఆదాయ వనరు లేకపోవడంతో నిత్యావసరాలు, వైద్య ఖర్చులు కూడా భారంగా మారాయని తెలిపారు. ప్రభుత్వం అందించే పింఛనే తమకు జీవనాధారమని, సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సదరం సర్టిఫికెట్ ప్రక్రియను పూర్తి చేసి వికలాంగ పింఛన్‌ను పునరుద్ధరించాలని బాధిత మహిళ జగమ్మ వేడుకుంటోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, పింఛన్ మంజూరు చేసి జీవనానికి భరోసా కల్పించాలని బాధిత కుటుంబం వేడుకుంటుంది.
-
Home
-
Menu
