వరద ప్రవాహంలో యువతి గల్లంతు.. ఎస్‌డిఆర్‌ఎఫ్ గాలింపు చర్యలు

వరద ప్రవాహంలో యువతి గల్లంతు.. ఎస్‌డిఆర్‌ఎఫ్ గాలింపు చర్యలు
X

మన తెలంగాణ/జఫర్‌గడ్: మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగి ప్రమాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలోని తిమ్మంపేట్ సమీపంలో స్టేషన్ ఘన్‌పూర్‌జఫర్‌గడ్ ప్రధాన రహదారిపై బోళ్ల మత్తడి వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువతీ, యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. యువకుడు మాత్రం ఓ చెట్టును ఆసరాగా చేసుకుని ప్రాణాలతో బయటపడగా, యువతి గల్లంతైంది. వెంటనే ఆ యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఘటన వివరాలను పోలీసులకు తెలిపాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రామారావు తన బృందంతో కలిసి అదే రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వెనుదిరిగారు.

గురువారం ఉదయం 30 మంది ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు ప్రారంభించారు. జనగామ దక్షిణ మండల డిసిపి రాజ మహేంద్ర నాయక్ , స్టేషన్ ఘన్ పూర్ ఆర్డీవో డిఎస్ వెంకన్న, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం పొద్దు పోయే వరకు గాలింపుచర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం కూడా గాలింపు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానికి తహసీల్దార్ బి. రాజేశ్, ఆర్‌ఐ లు బలరామ స్వామి, దేవేందర్ ఇతర అధికారులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. కాగా యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags

Next Story