మా శీలాలు మేమే రద్దు చేసుకుంటాం

చేతులు వేసే చచ్చు మొహాలు
లాఠీలు దూసే దుర్మార్గ న్యాయాలు
పోయాయనో,పోగొట్టుకోబయడతాయనో
అనుకునే మా శీలాలు పట్టుకు వేలాడే అరాచక రాజకీయాలు
వేధింపుల అనౌచిత్యాల కింద
మమ్మల్ని దోషులను చేసే నయా భంగపాట్లు
ఇక చాలు ఈ శీలాలతో వేగులాటలు
ఇక చాలు మా మానాలకై పాకులాటలు
చెయ్యేసిన వాడి చెయ్యి నరకక
ఆధారాలకై నేను తడుముకుంటూ
మళ్లీ మళ్లీ వాడి చేతిలోని నలుసునై ఇరుక్కుపోతూ
ఇంకెన్నాళ్లీ దేహ రక్షణకై కునికిపాట్లు?
దుర్నీతులు రాజ్యమేలుతున్న రోజులవి
సచ్చీలతలనే శిలువలపై బతుకులను ఊరేగిస్తున్న దుర్మార్గాలివి
పవిత్రతా, పాతివ్రత్యాల గిరిని మా చుట్టూ గీసి
పశుత్వంతో మీరే వాటిని చెరిపేయ చూసే రోతలివి
కక్షల కక్ష్యలను పెంచుకుంటూ జాతి దహన కాండలలో
మమల్ని బలి పశువులను చేస్తున్న చేతలివి
మహా దేహాపహరణ చేష్టలివి
విసిగిపోయాం..మీ చర్యలకు జడిసి, జడిసి వేసారి పోయాం
దుశ్శాసనులైమా వలువలు వలిచే నీచత్వానికి
ఇకనైనా చరమగీతం పాడనివ్వండి
జీహాదీలై,మా ప్రాణాలు తోడేసే తోడేలు బుద్దుల్ని కడిగి పారేసి
మీ ఆత్మలను శుద్ధి పరచనివ్వండి
కాలువలు కట్టిన మా కన్నీటి మంటల పై
మీ రాజ్య కాంక్షలను ఆరేసుకోవడం ఇకనైనా చాలించేలా చేస్తూ
మా శీలాలను మేమే రద్దు చేసుకుంటాం
కేవలం దేహాత్మలుగానే బతికేందుకు సిద్ధపడతాం
Tags
-
Home
-
Menu
