విప్లవోద్యమ ఆటుపోట్లు చారిత్రక మలుపులు

విప్లవోద్యమ ఆటుపోట్లు చారిత్రక మలుపులు
X

చరిత్ర పరిణామక్రమంలో ఒక సమాజపు లేదా ఉద్యమపు మలుపుల ప్రభావాన్ని అంచనా వేయడానికి చాలా కాలం పడుతుంది . చరిత్ర నిర్మాణం అవుతున్నప్పుడు ఆ నిర్మాణంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న ఉద్యమాల పాత్రను సరిగ్గా అంచనా వేయడం కూడా అంత సులభం కాదు. గత అర్ధ శతాబ్ద కాలంగా విప్లవోద్యమం ప్రధానంగా నక్సలైట్ పోరాటం ఒకవైపు, రాజ్యాన్ని మరొకవైపు సమాజాన్ని నిరంతరంగా ప్రభావితం చేస్తున్నది. ఈ విప్లవోద్యమాలు.. ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమాలు గత రెండు వందల ఏళ్లుగా రాజ్యానికి వ్యతిరేకంగా జరగుతూనే ఉన్నాయి. ఆదివాసీల జీవనవిధానం, అడవితో వాళ్ళకున్న అనుబంధం చాలా లోతైనది. అడవిలోకి ఎవరు బయట నుండి వచ్చినా ప్రశ్నించడం, ప్రతిఘటించడం చరిత్ర రికార్డు చేసి ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రధాన స్రవంతిలో జరుగుతున్న ఉద్యమానికి సమాంతరంగా ఎన్నో ఆదివాసి పోరాటాలు జరిగాయి. వలస పాలనకు, దోపిడీకి వ్యతిరేకంగా చాలా మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. ఒక వారం క్రితం బిర్సా ముండా జన్మదినాన్ని సమాజమే కాక రాజ్యం కూడా నిర్వహించింది.

ఆయన విగ్రహాలకు పూల దండలు వేయడం, వార్తాపత్రికల్లో పెద్దయెత్తున ప్రకటనలు చేయడం ఆయన అమరత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడమే . బిర్సా ముండా అప్పటి రాజ్యంతో పోరాడినవాడే. వలస పాలకులు ఆయనను, ఆయన ఉద్యమాన్ని వెంటాడి, వేటాడి బిర్సా ముండాను బలి తీసుకున్నారు. ఆయన త్యాగాన్ని ఇప్పటి పాలకులు గౌరవప్రదంగా సెలబ్రేట్ చేశారు. నిజానికి బిర్సా ముండా అడిగిన ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. బయటివాళ్లు మా అడవిలోకెందుకు వస్తున్నారు? మా సంపదని ఎందుకు దోచుకుంటున్నారు? మా అనుమతి లేకుండా మా వనరులను కొల్లగొట్టే అధికారం వాళ్లకు ఎక్కడినుంచి వచ్చింది? అని సమకాలీన ఆదివాసీ ఉద్యమాలు అడుగుతున్నాయి.

బిర్సా ముండా, రాంజీ గోండ్, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు వంటి నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. రాజ్యమే వాళ్ళ ప్రాణాలను తీసుకుంది. ఈ త్యాగాల వలన భారత రాజ్యాంగం రూపకల్పన జరుగుతున్న క్రమంలో రాజ్యాంగ సభలో ఆదివాసీ నాయకుడు జయపాల్ సింగ్ కీలకమైన ప్రశ్నలు అడుగుతూ గతంలో తాము ఏ రాజ్యాన్నీ విశ్వసించలేదని, మొదటిసారిగా ఈ రాజ్యాన్ని కొంత నమ్ముతున్నామని సంశయాత్మకంగానే అన్నాడు. దీనికి జవాబుగా నెహ్రూగారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంగీకరిస్తున్నామని అన్నాడు. ఆయన వ్యాఖ్యలలో వందల సంవత్సరాల ఆదివాసీ పోరాటాల స్ఫూర్తిని, చైతన్యాన్ని గమనించవచ్చు. ఈ పోరాటాల ఫలితంగానే రాజ్యాంగంలో షెడ్యూల్ 5, 6 చేర్చబడ్డాయి.

రాజ్యాంగంలో ఆదివాసీల హక్కులను చేర్చి బ్రిటిష్ పాలకులు రూపొందించిన ఎమినెంట్ డోమైన్ (eminent domain) అనే భావనను రద్దు చేయలేదు . ఎమినెంట్ డొమైన్ అంటే రాజ్యానికి, ఆదివాసీలకు మధ్య ఘర్షణ ఏర్పడితే దేశ ప్రయోజనాలరీత్యా రాజ్యానిదే పైచేయి అన్న వలస పాలన ఫార్ములాని కొనసాగించడంపై ఆదివాసీల ఆత్మీయుడు, బస్తరు కలెక్టర్ గా పనిచేసిన బి.డి. శర్మ నిరంతరంగా తన అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని తన రచనలలో, ప్రసంగాలలో వెలిబుచ్చేవాడు. ఆదివాసీలు తమ జీవన విధానాన్ని, సంస్కృతిని, స్వయంపాలనను కోరుకుంటారని, దాన్ని గౌరవించవలసిన బాధ్యత రాజ్యం మీద, సమాజం మీద ఉన్నదని శర్మగారు నమ్మేవారు. 1960 చివరలో దేశవ్యాప్తంగా భిన్న రకాల ఉద్యమాలు వెలుగు చూశాయి. వాటిలో ఉధృతంగా పైకి వచ్చినదే మావోయిస్టు ఉద్యమం. దాదాపు గత ఆరు దశబ్దాలుగా ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇది హింసాయుత ఉద్యమం అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. హింస గురించి జరిగే చర్చలో హింస ఎక్కడ ప్రారంభమైందనే మౌలిక ప్రశ్నలోకి వెళ్లకపోవడం ఈ ప్రచారానికి ఊపునిచ్చింది.

ఉద్యమం కూడా కొన్ని చర్యల వల్ల ఈ ప్రచారానికి కొంత బలాన్ని ఇచ్చింది. సమాజంలోని వ్యవస్థీకృత హింస మీద జరగవలసినంత చర్చ జరగలేదు. హింస నిర్వచనంలో భౌతిక హింస తప్ప సామాజిక సంబంధాలలో పాతుకుపోయిన ఆధిపత్య అణిచివేత, కులపర హింస, కుటుంబంలో హింస, గ్రామాలలో పెత్తందారుల హింస అవగాహనలో భాగం కాలేదు. హింస, ప్రతిహింస గురించి ప్రజాసంఘాలలో కూడా జరగవలసినంత చర్చ జరగలేదు. ఇక ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి పేరిట రాజ్యాంగం గతంలోలాగానే ప్రవేశించడం, దీనికి ఆదివాసీల ప్రతిఘటన పెరుగుతూ వచ్చాయి. ప్రభుత్వాలు ఒకవైపు పాజిటివ్ గా స్పందించి కొన్ని ఆదివాసీల హక్కుల కోసం చట్టాలు చేసాయి. షెడ్యూల్ 5ఏ కాక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, వన్ ఆఫ్ సెవెంటీ చట్టం, 2006లో అటవీ హక్కుల చట్టాలు వచ్చాయి. కానీ ఈ హక్కులను క్షేత్రస్థాయిలో గౌరవించలేదు. అమలు చేయలేదు. ఆదివాసీలు ప్రతిఘటించినకొద్దీ బల ప్రయోగాన్ని పెంచారు. ఇలా బల ప్రయోగంలో భాగంగా ఎన్కౌంటర్ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఇద్దరి మధ్య జరిగిన కాల్పులుగా చిత్రీకరిస్తూ వచ్చారు. ఇరువైపులా ప్రాణ నష్టాన్ని కేవలం విప్లవోద్యమ హింసగా ప్రచారం చేయడంలో రాజ్యం చాలావరకు సఫలీకృతం అయింది.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పౌరస్పందన వేదిక ఏర్పడటం, శంకరన్ గారి లాంటి ఒక అరుదైన ఐఏఎస్ అధికారి సారథ్యంలో సమాజంలో ప్రతిష్ఠ కలిగిన 15 మంది వ్యక్తుల కృషి వల్ల విప్లవోద్యమ నాయకులకు ప్రధానంగా మావోయిస్టు పార్టీ, జనశక్తి పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. చర్చలలో భాగంగా ఆయుధం పాత్ర తగ్గాలంటూ ప్రజా సమస్యలే కేంద్రంగా చర్చ విస్తృతంగా జరిగింది. ఈ చారిత్రక ప్రయోగం అర్ధంతరంగా ముగిసినా విప్లవోద్యమానికి, రాజ్యానికి మధ్య శాంతి చర్చలు సాధ్యమే అన్న ఒక అద్భుత అనుభవాన్ని సమాజానికి అందించింది. గత మూడు దశాబ్దాలుగా అమల్లోకి వచ్చిన సామ్రాజ్యవాద కార్పొరేటు అభివృద్ధి నమూనా భారతదేశ దిశను దశను చాలా వరకు మార్చింది. అభివృద్ధి నమూనాలో ఖనిజ వనరుల ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఏ అడవిలోని వనరుల రక్షణ కోసం బిర్సా ముండా పోరాడి అమరుడయ్యాడో ఆ ఘర్షణ తీవ్రతరమై కార్పొరేట్ వత్తిడి వలన రాజ్యం మొత్తం విప్లవోద్యమాన్ని పూర్తిగా నిర్మూలించాలని దృఢ నిశ్చయంతో ఉంది.

విప్లవోద్యమ హింసకు లేదా వాళ్ళ ఆయుధానికి చట్టబద్దత లేదని, రాజ్య బలప్రయోగాన్ని అనుమతిస్తుందని అంటూ తమ ఆయుధాన్ని చట్ట పరిధులు దాటి ఉపయోగిస్తున్నారు. రెండు వైపులా ఆయుధాలు చట్ట వ్యతిరేకమే. రాజ్యం చట్టబద్ధ పాలనను గౌరవించకుండా బల ప్రయోగం చేస్తే దానిని సమాజం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లేదా మౌనంగానో అంగీకరిస్తే ఈ ప్రయోగం కేవలం సాయుధులయిన వారిని చంపడం దగ్గర ఆగదు. ఆ విచ్చలవిడి అధికారం త్వరలోనే సమాజం పైకి వస్తుంది. తమ అధికారాన్ని ఏ మాత్రం ప్రశ్నించినా, విమర్శించినా పౌరులని, ప్రజాస్వామ్యవాదులని, చివరికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కూడా మావోయిస్ట్ అని ముద్ర వేస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నది. మావోయిస్టు నాయకత్వం జరుపుతున్న ఆదివాసీ ఉద్యమం అనుకోని చారిత్రక మలుపు తిరిగింది. మావోయిస్టు ఉద్యమాన్ని ఆదివాసీల మనుగడతో భిన్నంగా చూసిన కార్పొరేట్లు అడవిలో ఖనిజ వనరులనాక్రమించుకొని తవ్వడం ప్రారంభిస్తే అభివృద్ధిలో ఆదివాసీలకు ఏమైనా భాగస్వామ్యం ఉంటుందా? వాళ్లు నిర్వాసితులుగా మారితే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న చర్చకు రాలేదు. చర్చలు జరిగితే ఈ సమస్య లోతుల్లోకి వెళ్లడానికి అవకాశం ఏర్పడేది.

నిజమైన సమస్య ఆదివాసీల భవిష్యత్తు. ఆదివాసీ సమాజాలు బయట సమాజంతో పోలిస్తే చాలా ప్రజాస్వామ్య సమాజాలు. ఏ స్వార్థం లేకుండా సమిష్టితత్వం కలిగిన జీవనశైలి వాళ్లది. సొంత ఆస్తి లేని సమాజం అది. ఒక పార్శ్వం నుండి ఆదివాసీ మానవతా విలువలకి, స్వయంపాలన ఆకాంక్షకి, బయటి సమాజపు అమానుష ఆలోచనకి జరుగుతున్న పోరాటంగా కూడా చూడవచ్చు. మన సమాజపు ఏ మౌలిక సమస్యలకూ పరిష్కారం లేని ఈ నమూనా కొనసాగడం సాధ్యం కాదు. చారిత్రకంగా ఆదివాసి పోరాటాలు ఒక గణనీయమైన మలుపు తిరుగుతున్నవి. ఇది చరిత్రలో నిలిచే ఘట్టమే. రాబోయే తరాలు ఈ మలుపును ఎలా అంచనా వేస్తాయో, చరిత్ర ఈ మలుపును ఎలా చూస్తుందో అన్నది కూడా ఒక ప్రశ్న. ఈ పోరాటాలు అంతిమంగా ఒక మానవీయ, ప్రజాస్వామ్య, సహజీవన, శాంతియుత సమాజం ఏర్పడే దాకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయి.

- ప్రొఫెసర్ జి. హరగోపాల్

(ప్రముఖ విద్యావేత్త, పౌర నాయకుడు)

Tags

Next Story