గందరగోళంలో గగనయానం

గందరగోళంలో గగనయానం
X

అవసరాలకు తగినట్టు ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల రద్దీ రానురాను ఎక్కువవుతున్నా అనేక సమస్యలు ఎదురై గగనయానం గందరగోళంగా తయారవుతోంది. గత వారం రోజులుగా స్వదేశీ విమానయాన సంస్థలు పైలట్ల కొరత, సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, చలికాలం వల్ల షెడ్యూల్‌లో మార్పులు, తదితర సంక్షోభంలో తేలియాడుతున్నాయి. స్వదేశీ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో ప్రతిమూడు విమానాల్లో రెండు ఆలస్యంగానే నడుస్తున్నాయి. గత రెండు రోజుల్లో ఈ సంస్థకు చెందిన దాదాపు 300 కు పైగా విమానాలు రద్దు కావడం తెలిసిందే. ఇండిగో రోజుకు మొత్తం 2200 విమానాలను నడుపుతున్నా వీటిలో కేవలం 35 శాతం మాత్రమే డిసెంబర్ 2 న సరైన సమయానికి నడిచాయి. అదే రోజున ప్రభుత్వ అధీనం లోని అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాలు 38 శాతం సరైన సమయానికి నడిచాయంటే ఇండిగో సంస్థ విమానాల నిర్వహణ ఎలా ఉందో తెలుస్తుంది. ఈ సంక్షోభంపై పౌర విమానయాన శాఖ రంగం లోకి దిగి పరిశీలించగా అనేక అపసవ్య పరిస్థితులు బయటపడ్డాయి. కొందరు పైలట్లు డ్యూటీ రోస్టర్స్ (షిఫ్ట్ టైమ్)ను పాటించడం లేదని, మరికొందరు శెలవులు పెట్టి ఇతర విమానయాన సంస్థల్లో ఇంటర్వూలకు హాజరవుతున్నారని వెల్లడైంది.

శెలవులను రద్దు చేసుకుని వస్తే జీతానికి 1.5 రెట్లు చెల్లిస్తామని ఆఫర్ చేసినా ఇండిగో సంస్థకు సహాయపడలేదని తెలిసింది. ఈ కారణం గానే ఇండిగో మంగళవారం 130 విమానసర్వీసులు, బుధవారం 200 విమాన సర్వీసులను బలవంతంగా రద్దు చేయవలసి వచ్చింది. గురువారం కూడా ఈ పరిస్థితి కొనసాగుతోంది. రోజుకు దాదాపు 150 కి పైగా విమాన సర్వీసుల షెడ్యూల్ మారడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. పైలట్లు, ఇతర సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు మెరుగుపర్చడానికి డిజిసిఎ ఆయా సిబ్బంది టైమింగ్స్‌లో మార్పులు చేసింది. వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. రాత్రి పనివేళలను అర్ధరాత్రి నుంచి వేకువ జాము ఐదు గంటలకు మార్చారు. వరుసగా రెండు రాత్రులకు మించి సిబ్బందికి డ్యూటీలు వేయకూడదు. 14రోజుల్లో మొత్తం పనిగంటలు 95 మించకూడదు. గతంలో ఇది 100 గంటలుగా ఉండేది. ఒక్క రోజులో డ్యూటీ టైమ్ 12 గంటల వరకు ఉండగా, దీన్ని 10 గంటలకు తగ్గించారు. నైట్ డ్యూటీ ముగించుకున్న తరువాత ఇది వరకు 10 గంటలు మాత్రమే విశ్రాంతి ఉండగా, ఇప్పుడు కనీసం 12 గంటల వరకు ఉండాలని సవరించారు.

రాత్రిపూట విమానాశ్రయాల్లో ల్యాండింగ్ అయ్యే విమానాల సంఖ్య ఇదివరకు ఆరు ఉండగా, ఇప్పడు రెండుకు కుదించారు. ఈ నిబంధనలను డిజిసిఎ 2024 మేలోనే నోటిఫై చేయగా ఈ ఏడాది జులైలో మొదటి దశలో కొన్ని, నవంబర్ 1 నుంచి రెండోదశలో మరికొన్ని నిబంధనలను ఇండిగో అమలులో తీసుకొచ్చింది. ఈ నిబంధనలను స్వదేశీ విమాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా మొదట్లో వ్యతిరేకించినా, తరువాత ఢిల్లీ హైకోర్టు మార్గదర్శకాలతో తలవంచక తప్పలేదు. ఇండిగో సంస్థ మొదటి నుంచీ నిబంధనల అమలు విషయంలో నిర్లక్షం వహిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆరోపిస్తోంది. విమాన సంస్థల్లో సిబ్బందికి తగిన విశ్రాంతి అవసరం. ముఖ్యంగా సరిగ్గా నిద్రపోకుంటే అనేక సమస్యలు ఎదురై ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా తయారవుతుంది. గత సెప్టెంబర్ నెలలో పారిస్ నుంచి కోర్సికా ద్వీప రాజధాని అజాక్సియోకు బయలుదేరే విమానం దిగుతున్న సమయంలో ఎయిర్‌పోర్టు కంట్రోల్ టవర్ నుంచి సిగ్నల్ రాక గాలిలోనే 18 నిమిషాల పాటు విమానం చక్కర్లు కొట్టవలసి వచ్చింది.

ఇలా జరగడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఆ సమయంలో నిద్రపోవడమేనని తరువాత బయటపడింది. దీన్ని బట్టి నిబంధనల ప్రకారం సిబ్బందికి విశ్రాంతి కల్పించక తప్పదు. ప్రస్తుతం మనదేశం లోని పలు విమాన సంస్థలు 650 కి పైగా విమాన సర్వీస్‌లను నడుపుతున్నాయి. వీటిని నడిపేందుకు 8 వేల మంది పైలట్లు అందుబాటులో ఉన్నా సరిపోవడం లేదు. మరోవైపు భారతీయ పైలట్లకు ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దేశీయ విమాన సంస్థలతో పోలిస్తే ఈ దేశాల విమానయాన సంస్థలు వీరికి అత్యధికంగా జీతభత్యాలు ముట్టచెబుతున్నాయి. అందుకనే కొంతమంది భారతీయ పైలట్లు విదేశీయాన సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సమస్యలతో పాటు వాతావరణ మార్పులు విమాన సర్వీసులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో గత నవంబర్ 28, 29 తేదీల్లో ఎ320 నమూనా విమానాలు ఎదుర్కొన్న అనూహ్య పరిణామాలను గుర్తు తెచ్చుకుందాం.

సౌర ధార్మిక ప్రభావానికి గురై ఆ గ్రూపు విమానాల్లోని ఎలివేటర్ ఎయిలెరాన్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ దెబ్బతింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎ 320 విమానాలు దాదాపు 6000 స్తంభించిపోయాయి. సౌర ధార్మికత ప్రభావంతో విమానాలు 35,000 అడుగుల కిందకు అమాంతంగా దిగజారిపోవడంతో కొంతమంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను సరిచేయడానికి రెండు రోజులు పట్టింది. మరోవైపు సైబర్ దాడులు కూడా విమాన సర్వీసులను గందరగోళ పరుస్తున్నాయి. దేశం లోని ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అమృత్‌సర్, హైదరాబాద్ వంటి ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ స్పూఫింగ్ జరిగినట్టు గతంలో కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. జిపిఎస్ స్పూఫింగ్ అంటే తప్పుడు సిగ్నల్స్‌ను ప్రసారం చేసి విమానాల నావిగేషన్ వ్యవస్థలను దారి తప్పించే సైబర్ దాడి. ఈ దాడుల మూలాలు గుర్తించేందుకు ప్రభుత్వం పరిశోధన చేపట్టింది.

Tags

Next Story