‘దాదా’ మృతితో ‘మహా’పవార్‌లో శూన్యత

పవార్‌ల కుటుంబానికి కంచుకోట బారామతి నియోజకవర్గం. అజిత్ పవార్ నేతృత్వంలో పవార్ వర్గాలు ఒకటై ముందుకు వెళ్లడానికి గత కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు అజిత్ పవార్ అకాల మరణంతో అడుగంటిపోయే విషాద పరిస్థితి నెలకొంది. ఇటీవల కొన్ని వారాల క్రితం పవార్ కుటుంబం మొత్తం ఎన్‌సిపికి నాయకత్వ బాధ్యత అప్పగించడానికి అంగీకరించింది. ఈ మేరకు శరద్ పవార్ కాస్త వెనక్కు తగ్గడానికి సిద్ధమయ్యారు. వారసత్వ బాధ్యతపై చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. రేపోమాపో ఎన్‌సిపి పూర్తి బాధ్యత అజిత్ పవార్‌కే అప్పగించనున్న తరుణంలో విధి వక్రించింది. వంశపారం పర్య రాజకీయాలను ఒక పద్ధతి ప్రకారం కేంద్రీకృతం చేయడానికి అజిత్ పవార్ నాయకత్వం తప్పనిసరి అనిపిస్తోంది. 1959 జులై 22న జన్మించిన అజిత్ పవార్ తన చిన్నాన్న శరద్ పవార్ మార్గదర్శకత్వంలో రాజకీయ అరంగేట్రం చేశారు. బారామతి నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. తరువా తన చిన్నాన్న శరద్ పవార్ కోసం తన స్థానాన్ని త్యాగం చేయడంతో శరద్ పవార్ కేంద్ర రక్షణ మంత్రిగా పదవిని పొందడానికి పివి నరసింహారావు ప్రభుత్వంలో వీలైంది. అజిత్ పవార్ తన చిన్నాన్న రాజకీయ శైలిని అత్యంత వేగంగా అలవర్చుకున్నారు. ఎంతో క్రమశిక్షణతో, అంకిత భావంతో రాజకీయాల్లో పరిణితి చెందారు.
రోజూ ఉదయం 6 గంటలకే తన కార్యక్రమాలను ప్రారంభించి నాయకులకు ఆదర్శమయ్యారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆల్కహాలు, స్మోకింగ్ అలవాట్లకు దూరంగా ఉండేవారు. రోజూ ఉదయం నాలుగైదు కిలోమీటర్లు దూరం నడిచేవారు. రాజకీయ కేంద్రంగా రాణించే సామర్థాన్ని సాధించారు. రాష్ట్ర స్థాయి నాయకుడే అయినప్పటికీ బారామతి నియోజకవర్గం ఆయన కనుసన్నల్లో ఉండేది. ఆయన విజయాలు, అపజయాల్లోనూ బారామతి నియోజక వర్గం ఆయనకే అండదండలు అందించేది. అందువల్లనే 8 సార్లు బారామతి నియోజకవర్గం ఎంఎల్‌ఎగా రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించగలిగారు. ఆయనను అంతా ఆప్యాయంగా ‘దాదా’ అని పిలిచేవారు. క్షేత్రస్థాయి కార్యకర్తలను ఎంఎల్‌ఎలుగా, ఎంపిలుగా ఉన్నత స్థాయిలోకి తీసుకు రావడానికి కృషి చేసేవారు. పార్టీలకు అతీతంగా ఆయన మాటను నాయకులంతా పాటించేవారు. సీనియర్ నాయకులు కూడా ఆయనకు పోటీగా ఉండడానికి ఇష్టపడేవారు కాదు. చట్టాలు, నిబంధనలు, పాలనా విధానాలపై ఆయనకు విస్తృత పరిజ్ఞానం ఉండేది.
బలమైన సామాజిక నాయకునిగా ముద్ర గల గట్టి నేత అజిత్ పవార్. ప్రజా సంక్షేమం కోసం ఏమి చేయాలి? వ్యవస్థలను ఎలా వినియోగించాలి? అన్నది ఆయనకు బాగా తెలుసు. కేవలం శుష్క వాగ్దానాలతో పైపై మెరమెచ్చు ప్రణాళికలతో ప్రజలను తప్పుదారి పట్టించేవారు కాదు. దీంతో ఆయన మంచి సమర్థత గల పాలనాదక్షుడు అన్న పేరు సంపాదించగలిగారు. అజిత్ పవార్ తన చిన్నాన్న శరద్ పవార్ నీడలో ఏనాడు అసౌకర్యానికి గురైనట్టు కనిపించేవారు కాదు. శరద్ పవార్ కేంద్ర రాజకీయాలపై దృష్టి కేంద్రీకరిస్తుంటే అజిత్ రాష్ట్రస్థాయి వ్యవహారాలను చూసుకునేవారు. ఈ విధంగా దాదాపు మూడు దశాబ్దాలు ఈ బాధ్యతల పంపకం చాలా సున్నితం జరిగింది. శరద్ పవార్ కూడా అత్యంత జాగ్రత్తగా తన కుమార్తె సుప్రియా సూలేకు, తన అన్న కొడుకు అజిత్ పవార్‌కు బాధత్యలు పంపిణి చేసేవారు. వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడేవారు. అయితే అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో అట్టడుగు స్థాయి నుంచి కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందగా, సుప్రియా జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించడానికి ప్రయత్నించేది. రాజకీయ విభేదాలు తలెత్తినప్పుడు శరద్ పవార్ తన అన్న కొడుకు అజిత్ కే రక్షణ కల్పించేవారు.
అజిత్ కూడా తన చిన్నాన్న గీసిన గిరి దాటే వారు కాదు. శరద్ పవార్ మాటే తుది నిర్ణయంగా భావించేవారు. కొన్ని సార్లు వీరి భావాలు వేరైనా పరస్పర గౌరవ ప్రతిపత్తి పాలనా పరంగా వ్యక్తమయ్యేది. అజిత్ పవార్ తర్వాత బిజెపితో పొత్తు పెట్టుకొని, బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంలో డిప్యూటీ సిఎం అయ్యారు . ఈ విధంగా బిజెపితో పొత్తు ఉన్నప్పటికీ సెక్యులరిజం ప్రగతిదాయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. సాహు ఫూలే అంబేద్కర్ సిద్ధాంతాలను తాను విడిచిపెట్టబోనని బహిరంగంగా పదేపదే ప్రకటించేవారు. డిప్యూటీ సిఎంగా ఎనిమిది సార్లు పదవిని నిర్వహించినా ముఖ్యమంత్రి పీఠంపై మక్కువ చూపించేవారు. తన కెరీర్‌లో అనేక సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని సాధించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన వయస్సు కూడా దీనికి సహరించేది. అయినప్పటికీ ఆయనకు రాజకీయంగా ముఖ్యమంతి కావడానికి కాలం కలిసి రాలేదు.
అనేక ముఖ్యమంత్రుల వద్ద ఉప ముఖ్యమంత్రులుగానే కాలం గడపవలసి వచ్చేది. వివిధ నాయకత్వ లక్షణాలను విజయవంతంగా అలవర్చుకున్నారు. పరిస్థితులను బట్టి రాజకీయంగా త్వరగా నిర్ణయాలు తీసుకునేవారు. సామాన్య ప్రజానీకంతో నిత్యం సంబంధం నెరపేవారు. అనేక కుంభకోణాల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు రూ. 70,000 కోట్ల ఇరిగేషన్ స్కాం జరిగినట్టు ఆరోపణ వచ్చింది. అయితే ఇవన్నీ రాజకీయంగా తనను అప్రతిష్టపాలు చేయడానికి సృష్టించినవేనని తిప్పికొట్టారు. ఎంఎస్‌సిబి రుణ కుంభకోణం జరిగిందని అజిత్‌పై ఆరోపణ వచ్చినా ఆ ఆర్థిక నేరాల్లో ఎలాంటి సాక్షం లేకపోవడంతో 2024లో అది ముగిసింది. ఎన్ని వివాదాలు ఎదురైనా ప్రజల నమ్మకం మాత్రం అజిత్‌పై చెక్కుచెదరలేదు. అజిత్ పవార్ మరణం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం కలిగించకపోయినా, ఎన్‌సిపి వర్గాల్లో మాత్రం అనిశ్చితిని సృష్టిస్తుంది. అజిత్ అంతటి సమర్థులు ఎన్‌సిపిలో ఎవరున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది.
-
Home
-
Menu
