అగ్రరాజ్యానికి ఆయుధమే ఆహారం యుద్ధమే పెట్టుబడి

ప్రపంచపటంలో తననుతాను ‘ప్రజాస్వామ్య రక్షకురాలు’గా, ‘శాంతి కాపలాదారు’గా చిత్రించుకునే అమెరికా అసలు రంగు యుద్ధం. అమెరికాకు ఆయుధమే ఆహారం, యుద్ధమే పెట్టుబడి. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ చమురుతో కాదు, ఇతర దేశాల్లో చిందే రక్తంపై, ఆయుధాల అమ్మకాలపై ఆధారపడి నడుస్తోంది. శాంతిమంత్రం పైకి జపిస్తూనే, లోపల యుద్ధతంత్రాన్ని నడిపే అమెరికా వైఖరి మానవజాతికే ఒక కళంకం.‘అమెరికా ఆయుధాలు తింటోంది’ అనేది నేడు ఒక చేదు నిజం. అంటే.. అది కేవలం లోహపు ముక్కలను మింగడం కాదు; కోట్లాదిమంది అమాయకుల కలలను, పసిపిల్లల భవిష్యత్‌ను, స్వతంత్ర దేశాల సార్వభౌమత్వాన్ని పచ్చిగా నమిలి మింగుతోందని అర్థం. అమెరికాకు శాంతి అంటే ఒక నినాదం మాత్రమే. కానీ యుద్ధం అంటే ఒక భారీ లాభదాయకమైన వ్యాపారం.ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెట్టడం, ఆ మంటల్లో తన ఆయుధాల ఫ్యాక్టరీలను వేడి చేసుకోవడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. ఒక దేశంపై బాంబులు కురిపించాలన్నా, మరో దేశపు సార్వభౌమత్వాన్ని కాలరాయాలన్నా అమెరికాకు కావాల్సింది ‘ప్రజాస్వామ్య రక్షణ’ అనే ఒక అబద్ధపు సాకు. ఆ దేశపు క్షిపణులపై రాసి ఉండేది శాంతి సందేశం కాదు, రాబోయే వినాశనం తాలూకు ధర. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అది అమెరికా స్టాక్ మార్కెట్‌కు పండగే. శ్మశానాల మీద సౌధాలు నిర్మించుకునే వికృత ఆర్థిక వ్యవస్థ అమెరికాది.
డాలర్ విలువ పెరగాలంటే మరో దేశం రణరంగం కావాల్సిందే. మధ్య ప్రాచ్యం నుంచి ఐరోపా వరకు అమెరికా వేసిన ప్రతి అడుగు వెనుక చమురు వేట, ఆయుధాల అమ్మకం తప్ప మానవత్వం ఎక్కడా కనిపించదు. మందుగుండు సామాగ్రిని అమ్మడం కోసం శత్రువులను సృష్టించడం, ఆపై మధ్యవర్తిగా నటిస్తూ ఇరుపక్షాల రక్తాన్ని పీల్చడం - ఇదే వాషింగ్టన్ అనుసరిస్తున్న అసలైన ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’.అమెరికా ఆర్థిక వ్యవస్థకు యుద్ధం అనేది ఒక ‘లైఫ్ సపోర్ట్’ లాంటిది; అది ఆగిపోతే ఆ దేశపు జిడిపి వెంటిలేటర్ మీదకు వెళ్తుంది. లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, రేథియాన్ వంటి సంస్థల షేర్లు పెరగాలంటే, మరో దేశంలో పసిపిల్లల హాహాకారాలు వినిపించాలి. శత్రువు లేకపోతే అమెరికా మనుగడ లేదు. అందుకే ఒకవేళ ప్రపంచంలో శత్రువు లేకపోతే, తన ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఒక కొత్త శత్రువును తానే సృష్టించి, అతడిని ప్రపంచానికి విలన్‌గా పరిచయం చేస్తుంది.
అమెరికా నేరుగా యుద్ధ రంగంలోకి దిగదు, కానీ యుద్ధం ఆగిపోనివ్వదు. దీనినే ఆ దేశం ‘ప్రాక్సీ వార్’ అని పిలుచుకుంటుంది. రష్యాను దెబ్బకొట్టడానికి ఉక్రెయిన్‌ను ఒక పావుగా వాడుకుంటూ, వేలకోట్ల విలువైన ఆయుధాలను సరఫరా చేస్తోంది. దీనివల్ల ఉక్రెయిన్ నాశనమవుతున్నా, అమెరికా ఆయుధ కంపెనీల లాభాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా తన యుద్ధోన్మాదంతో ప్రపంచదేశాలపై రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాయుధ, సాంకేతిక అణచివేతలకు పాల్పడుతుంది.సుమారు 800 బిలియన్ డాలర్లకు పైగా రక్షణ బడ్జెట్‌తో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనికశక్తిగా ఉంది. ఇది మిగతా టాప్ 10 దేశాల బడ్జెట్ కంటే ఎక్కువ. ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో సుమారు 40% వాటా అమెరికాదే. అభివృద్ధి చెందుతున్న దేశాలు సొంతంగా రక్షణ రంగంలో ఎదగకుండా ఆంక్షలు విధిస్తూ, ప్రపంచ దేశాలన్నీ సాంకేతికత కోసం తనపైనే ఆధారపడేలా చేసుకుంటుంది.
ఒకసారి అమెరికా ఆయుధాన్ని కొంటే, ఆ దేశం ఇక దశాబ్దాల పాటు అమెరికాకు బానిసగా ఉండాల్సిందే. ఇది రక్షణ ఒప్పందం కాదు, ఒక దేశంపై రుద్దే ‘డిజిటల్, మిలిటరీ బానిసత్వం’. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన ఐక్యరాజ్యసమితి, నేడు అమెరికా చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయింది. తన ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ తీర్మానాన్ని అయినా అమెరికా తన ‘వీటో’ అధికారంతో తొక్కిపెడుతుంది. అణ్వాయుధ రాజకీయంలో అమెరికాది అందెవేసిన చెయ్యి. ‘తుపాకీ గొట్టంద్వారా వచ్చే శాంతి శ్మశాన శాంతి మాత్రమే. అది ఎప్పటికీ శాశ్వతం కాదు. ‘దీన్ని అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా తోపాటు ప్రపంచ దేశాలన్నీ గుర్తుంచుకోవాలి. శాంతి అనేది బాంబుల మోత ఆగినప్పుడు వచ్చే నిశ్శబ్దం కాదు.. అది ప్రతి మనిషి భయం లేకుండా బతికే స్వేచ్ఛ. అధికారం కంటే మానవత్వం, ఆయుధాల కంటే సహజీవనం గొప్పవని ప్రపంచ దేశాలు గుర్తించి, అమెరికా సృష్టిస్తున్న ఆయుధ విషవలయం నుండి, ‘సాంకేతిక బానిసత్వం’ నుండి బయటపడినప్పుడే భూమిపై నిజమైన శాంతి వెల్లివిరుస్తుంది. ఆయుధాలు లేని ప్రపంచమే రేపటి తరానికి మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి!
- విశ్వజంపాల, 7793968907
Tags
-
Home
-
Menu
