బహుళ జాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం

బహుళ జాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం
X

నేడు ప్రపంచంలో బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం కొనసాగుతున్నది. ఈ ఆధిపత్యంలో అమెరికా సంస్థలు అగ్రస్థానంలో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో సామ్రాజ్యవాద శక్తి కింద ఉన్న అనేక ప్రాంతాలు స్వయం పాలన పొందాయి. అమెరికా, దాని దిగ్గజ సంస్థల ద్వారా అతిపెద్ద పారిశ్రామిక శక్తిగా అవతరించింది. ఈ కార్పొరేట్లు తమ అనుబంధ సంస్థల ద్వారా వెనుకబడిన దేశాలకు మూలధనం ఎగుమతి చేయడం ప్రారంభించాయి. అమెరికా ఇప్పుడు దాని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ) ద్వారా మూలధనాన్ని ఎగుమతి చేసే అత్యంత ఆధిపత్య దేశంగా మారింది. బహుళజాతి సంస్థలకు లాభాలు పెంచుకునే ఉద్దేశమే ప్రధానమైంది. లాభాలను తమ దేశాలకు తరలించుకుపోవడం, రాయిల్టీ చెల్లింపులు, కమీషన్లు, సాంకేతిక కన్సల్టెన్సీ రుసుముల ద్వారా బహుళజాతి సంస్థలు దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పుడు బహుళజాతి సంస్థల ఆర్థిక దోపిడీని నయా వలస వాదం లేదా నయా సామ్రాజ్యవాదంగా వెనుకబడిన దేశాలకు విస్తరింప చేశారు. తమ శాఖల అనుబంధ సంస్థల ద్వారా వివిధ దేశాల పారిశ్రామిక, మార్కెటింగ్ ప్రాంతాల్లో తమ కార్యక్రమాలను విస్తరించుకుంటాయి. అనేక రంగాల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తులు చేస్తూ అనేక దేశాలపై వ్యాపార వ్యూహాన్ని విస్తరిస్తాయి.

1990 ల ప్రారంభంలో 37 వేల బహుళజాతి కంపెనీలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఆక్రమించాయి. ఈ కంపెనీలు భారీ మొత్తంలో ఆర్థిక వనరులు కలిగి ఉన్నాయి. 200 వందల అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సి) సంపాదించిన ఆదాయం 1982లో 3,046 బిలియన్ల డాలర్ల నుండి 1992 నాటికి 5,862 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ కాలంలో ప్రపంచ జిడిపిలో బహుళజాతి సంస్థల వాటా 24.2% నుండి 26.8%కి చేరింది. 1992 లో బహుళజాతి సంస్థల మొత్తం లాభాలు 73.8 బిలియన్ డాలర్లు. ఇందులో అతిపెద్ద 10 బహుళజాతి సంస్థల వాటా 38.8 బిలియన్ డాలర్లు. (అంటే 47%.) నేడు ప్రపంచంలో బహుళజాతి సంస్థలు సంఖ్య 60 వేలు దాటింది. ‘స్వాతంత్య్రం’ వచ్చిన దగ్గర నుంచి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి విదేశీ సహకారాల రూపంలో బహుళజాతి సంస్థలు భారతదేశంలోకి ప్రవేశించాయి. దేశపాలకులు వాటిని ఆహ్వానించారు. భారత ఆర్థిక వ్యవస్థలోకి బహుళజాతి సంస్థలు ప్రవేశిండం, దేశ ఆర్థిక వ్యవస్థపై దాని దుష్ప్రభావం ఎడల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పాలకుల విధానాల వల్ల నేడు భారత ఆర్థిక వ్యవస్థపై బహుళజాతి సంస్థల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. 1970లో కూడా అత్యున్నత స్థానంలో ఉన్న కంపెనీల ఆస్తులలో దాదాపు 37.7% బహుళజాతి సంస్థల నియంత్రణలో ఉంది. పారిశ్రామిక లైసెంన్సింగ్ విధాన విచారణ కమిటీ అంచనాల ప్రకారం 1966 లో భారతదేశంలో 10 కోట్ల రూపాయల అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులతో దాదాపు 112 బహుళజాతి సంస్థలు పని చేశాయి.

ఈ కంపెనీల్లో 48 కంపెనీలు విదేశీ శాఖల లేదా విదేశీ కంపెనీల భారతీయ అనుబంధ సంస్థలు, 14 ఇతర కంపెనీలు భారీ రుణాలు, ఈక్విటీ మూలధనం కలిగి ఉన్నాయి. వీటిని విదేశీ కంపెనీలు నియంత్రించాయి. ఈ 62 కంపెనీలకు దాదాపు 1,370 కోట్ల ఆస్తులు ఉన్నాయి. భారతదేశంలో పని చేస్తున్న దిగ్గజ కంపెనీల మొత్తం ఆస్తుల్లో 54%గా ఉంది. మిగిలిన ఇతర కంపెనీలూ విదేశీ ఆధిపత్యంలోనే ఉన్నాయి. 1960 ల మధ్య కాలంలో పాశ్చాత్య విదేశీ మూలధనం దేశంలోని పెద్ద వ్యాపారాలపై ఆధిపత్యం కలిగి ఉంది. భారతదేశంలోని బహుళజాతి సంస్థల ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, అవి భారత ఆర్థిక వ్యవస్థ వనరుల్లోనే ఎక్కువ భాగాన్ని సేకరిస్తున్నాయి. సుదీప్ చౌదరి 1956 నుంచి 1975 సంవత్సరం వరకు 50 అతిపెద్ద విదేశీ అనుబంధ సంస్థల నమూనాలను తీసుకుని బహుళజాతి ఆర్థిక వనరులపై అధ్యయనం చేశాడు. ఈ కంపెనీల మొత్తం ఆర్థిక వనరుల్లో 5.4% మాత్రమే విదేశీ వనరుల ద్వారా అందించబడిందని మిగిలిన 94.6% భారతదేశ వనరుల ద్వారా అందించబడిందని ఆయన అధ్యయనం వెల్లడించింది. బహుళజాతి కార్పొరేట్ సంస్థలు భారతదేశం నుంచి పెద్ద ఎత్తున లాభాలు తరలించుకుపోతున్నాయి. 2020-21 లో 2 లక్షల, 50 వేల కోట్ల రూపాయలుగా ఉన్న కార్పొరేట్ లాభాలు 2024 -25లో 7 లక్షల, వెయ్యి కోట్ల రూపాయలకు చేరాయి.

ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. దేశంలో సంవత్సర కాలంలో కార్పొరేట్ సంస్థల పన్నుల కంటే వాటి యజమానుల వ్యక్తిగత పన్నులు మించిపోయాయి. 2020- 21 నుంచి 2025 మధ్య కాలంలో బహుళజాతి సంస్థల లాభాలు మూడింతలు పెరిగినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దేశంలో ఆర్థిక అసమానతల ముఖ చిత్రాన్ని కార్పొరేట్ల లాభాలు బహిరంగ పరుస్తున్నాయి. దేశం మొత్తం జనాభాలోని 10% మంది వద్ద 77% సంపద పోగుబడి ఉంది. ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం 2017లో దేశ సంపదలో 73% సంపద 1% సంపన్నులకు చేరింది. కటికి పేదవారైన 67 కోట్ల ప్రజల్లో సగం మంది ఆస్తిలో కేవలం 1% పెరుగుదల మాత్రమే ఉంది. కార్పొరేట్ల సంపద పెరుగుదలతోపాటు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రాయితీలతోపాటు రుణాల రద్దు చేస్తున్నది. ఆర్‌బిఐ ఇచ్చిన డేటా ప్రకారం 2014- 2024 వరకు భారతీయ బ్యాంకులు మొండి బకాయిల పేరుతో రూ. 16,61,310 కోట్ల కార్పొరేట్ల రుణాలు రద్దు చేశాయి. ఇవి కాక 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ. 91,260 కోట్ల రూపాయల బకాయిలు రద్దు చేశాయి. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి దేశపాలకులు సామ్రాజ్యవాద ప్రయోజనాలు కాపాడుతూ, బహుళజాతి సంస్థల ప్రవేశానికి గేట్లు బార్ల తెరిచారు. ఫలితంగా బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం, వాటి దోపిడీ, సంపద తరలింపు దేశం నుంచి పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. మోడీ ప్రభుత్వం కూడా వాటి ప్రయోజనాలకు అనుగుణమైన విధానాలు అమలు జరుపుతున్నది. బహుళజాతి సంస్థల దోపిడీకి, దేశ సంపద తరలింపుకి,మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత ప్రజలు ఉద్యమించాలి.

- బొల్లిముంత సాంబశివరావు

98859 83526

Tags

Next Story