జిన్‌పింగ్‌ట్రంప్ భేటీపై ఉత్కంఠ

Anticipation surrounds the jin pingTrump meeting
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాలో మూడు రోజులపాటు పర్యటిస్తుండడంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ పర్యటన ప్రపంచ వ్యవహారాలపై ప్రభావం చూపిస్తుందని, అమెరికాచైనా ద్వైధ్రువ ఆధిపత్యం పెరగడానికి దోహదం చేస్తుందని రాజకీయ అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బీజింగ్‌కు వెళ్లి వచ్చిన కేవలం నాలుగు నెలల తరువాతనే ఈ పర్యటన జరగడం విశేషం. ప్రపంచం లోని రెండు శక్తివంతమైన దేశాలైన చైనా అమెరికా మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగించాలనే ఆసక్తి ఈ పర్యటన ఆంతర్యంలా కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం రష్యా, ఇరాన్‌లతో వాణిజ్యం కొనసాగించే ఏ దేశంపైనైనా 100% వరకు సుంకాలు (టారిఫ్‌లు) విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అమెరికా కాంగ్రెస్ కట్టబెట్టింది.
రష్యా, ఇరాన్‌లకు చైనా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అదే సమయంలో దక్షిణ కొరియా లోని బుసాన్‌లో అమెరికా చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం గడువు కొద్ది వారాల్లో ముగియనుంది. అందువల్ల జిన్‌పింగ్ పర్యటనకు వాణిజ్య సంబంధాల పరంగా కూడా ప్రాధాన్యత కనిపిస్తోంది. ఇద్దరు అధ్యక్షుల మధ్య జరగనున్న ద్వైపాక్షిక చర్చల్లో కృత్రిమ మేధ వల్ల ప్రమాదం ఉందనే భయాలు, వాణిజ్యం, సాంకేతికత, తైవాన్ సమస్య, వ్యూహాత్మక ఖనిజాలు, అంతర్జాతీయ సంబంధాల్లో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించుకునే ప్రయత్నాలు ఇవి ప్రధానంగా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. అమెరికా చైనా భాగస్వాములుగా ఉండాలని, ప్రత్యర్ధులు కాదని జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు ముందు వ్యాఖ్యానించడం చెప్పుకోతగ్గది. కృత్రిమ మేధ విషయంలో ఇరుదేశాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అమెరికా తన సాంకేతిక ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తుండగా, సాంకేతిక రంగంలో తన ప్రభావాన్ని విస్తరించేందుకు చైనా ప్రయత్నిస్తోంది.
ఈ వ్యూహంలో భాగంగా ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో ప్రపంచ దక్షిణ దేశాల కోసం ఓపెన్ సోర్స్ ఎ3 సముదాయాన్ని ఏర్పాటు చేయాలని జిన్‌పింగ్ ప్రతిపాదించడం గమనార్హం. ఇక తైవాన్ సమస్య అమెరికా చైనా సంబంధాల మధ్య అత్యంత క్లిష్టమైన సమస్యగా కొనసాగుతోంది. ఈ విషయంలో చైనాతో ప్రత్యక్ష ఘర్షణకు వెళ్లకుండా వాస్తవ పరిస్థితులను పరిగణన లోకి తీసుకుని ఆచితూచి వ్యవహరించేందుకు ట్రంప్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అమెరికా ఇప్పటికీ తన దీర్ఘకాలిక తైవాన్ విధానాన్ని కొనసాగిస్తోంది. అలాగే తైవాన్ రిలేషన్స్ యాక్ట్ కింద అమెరికాకు ఉన్న చట్టపరమైన బాధ్యతలను కూడా కొనసాగిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు 42 శాతం వాటాను కలిగి ఉన్న ఈ రెండు దేశాలు ఇతర దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి తమ పరస్పర ప్రయోజనాల కోసం మాత్రమే ఒప్పందాలు చేసుకుంటే ప్రపంచంలో ఒక రకమైన ‘ద్వంద్వ ఆధిపత్యం’ ఏర్పడుతుందని, ఇది అంతర్జాతీయ ప్రపంచ వ్యవస్థకు తీవ్రమైన విఘాతం కలిగించవచ్చన్న ఆందోళన కూడా కొన్ని దేశాల్లో వ్యక్తమవుతోంది.
ఈ ఇద్దరు అధ్యక్షుల మధ్య భేటీ, తరువాతి పరిణామాలపై భారత్‌తోపాటు ఆసియా దేశాలు జాగ్రత్తగా అంచనా వేస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందాలేమైనా కుదురుతాయా, లేక తమ సంబంధాల్లో మరింత స్థిరత్వం, స్పష్టత తీసుకువచ్చే ముఖ్యమైన పురోగతి సాధిస్తాయా లేక ఈ భేటీ ఆశించిన ఫలితాలు ఇవ్వకుండా మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుందా? అన్న ఆలోచనలో పడ్డాయి. జో బైడెన్ ప్రభుత్వం చైనాను సామర్ధాల విషయంలో పెద్ద సవాలుగా భావించేది. భారత్‌కు తగిన ప్రాధాన్యాత కల్పించేది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తరువాత కూడా చైనాతో పోటీ కొనసాగుతోంది. అయితే అమెరికాకు ప్రధాన భౌగోళిక, రాజకీయ ముప్పుగా చైనాను చూపించే విధానం చాలావరకు ట్రంప్ ప్రభుత్వం తగ్గించింది. 2025 జాతీయ భద్రతా వ్యూహంలో కూడా ఇదే కనిపిస్తోంది. చైనాతో తైవాన్ అంశంపై ఇటీవల జరిగిన ఉద్రిక్తతలో జపాన్‌కు మద్దతు ఇవ్వడానికి ట్రంప్ పెద్దగా ఆసక్తి చూపలేదు. చైనాపై అమెరికా మరింత అనుకూలమైన విధానాన్ని అవలంబిస్తే ఆసియాలో చైనా శక్తిని సమతుల్యం చేయడానికి భారత్ వంటి దేశాల అవసరం అమెరికాకు కొంత తగ్గవచ్చు.
ట్రంప్ అప్పుడప్పుడు ‘జి 2’ ఆలోచనకు మద్దతు ఇవ్వడంపై భారత్‌తోపాటు మరికొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జి2 అంటే ప్రపంచం లోని రెండు ప్రధాన సూపర్ పవర్స్ అయిన అమెరికా, చైనా కలిసి ప్రపంచం లోని అత్యంత ముఖ్యమైన విధానాలను నిర్ణయించడం అనే భావన. అలా జరిగితే చైనాతో సరిహద్దు వివాదం ఉన్న భారత్ వంటి దేశాల ప్రయోజనాలకు అమెరికా తక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చనే ఆందోళన ఉంది. అమెరికా చైనా ఆధిపత్యంతో కూడిన ‘జి2’ వ్యవస్థ ఉద్భవిస్తున్న నేపథ్యంలో భారత్, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ వంటి మధ్యస్థాయి దేశాలు పరస్పరం మరింత సన్నిహితంగా సమన్వయం చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. తద్వారా ప్రపంచం లోని బలమైన దేశాలు ఇతర దేశాలపై ఒత్తిడి, అధిపత్యం చెలాయించకుండా తమ ప్రయోజనాలను, సార్వభౌమత్వాన్ని రక్షించుకోవచ్చు. ఇదిలా ఉండగా, అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ట్రంప్ కార్యవర్గానికి ఈ భేటీ కీలకంగా మారింది. ఈ చర్చల పరిణామాలను తన విజయంగా ట్రంప్ ప్రచారం చేసుకుని ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే కాంగ్రెస్ ఉభయ సభల్లో రిపబ్లికన్ల పెత్తనానికి గండి పడే ప్రమాదం ఉంది.
Tags
-
Home
-
Menu
