‘వెండితెర’పై బాబు తొండి రాజకీయం!

ప్రభుత్వం చేసే తప్పుడు నిర్ణయాలవల్ల ప్రజలకు కలిగే నష్టం విషయంలో సమాజంలో వ్యతిరేకత పెరుగుతున్నదంటే ఆ అంశంనుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఏదో ఒక వివాదాన్ని సృష్టించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మించినవాళ్లు ఈ దేశరాజకీయాల్లో ఇంకొకరు ఉండరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒక అంశం మీద ప్రజలలో తీవ్ర వ్యతిరేకత పెరగడం చూస్తున్నాం. అది వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు నిర్ణయించి, నిర్మాణం ప్రారంభించి, ఐదు కళాశాలల నిర్మాణం పూర్తయి విద్యార్థులు చేరి వైద్య విద్య కొనసాగుతున్న పరిస్థితుల్లో ఆ మొత్తం వైద్య కళాశాలలను ప్రైవేటు పబ్లిక్ పార్టనర్ షిప్ (పిపిపి) పేరుతో ప్రైవేటీకరించే నిర్ణయం చంద్రబాబు ప్రభుత్వం తీసుకోవడం.
దానిమీద ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దయెత్తున ఆందోళనకు దిగడం, ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత కనబడటంతో ఆ సమస్యనుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు ఆయన బిజెపి సభ్యుడు కామినేని శ్రీనివాస్‌ను, తన సొంత బావమరిది, టిడిపి సభ్యుడు, నటుడు బాలకృష్ణను రంగ ప్రవేశం చేయించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో 8,884 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ రంగంలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి తీసుకున్న నిర్ణయానికి కేంద్రంనుండి సాంకేతిక అనుమతులు కూడా వచ్చాయి. కళాశాలలన్నీ వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఈ సమయంలో పిపిపి పేరుతో చంద్రబాబు నాయుడు ఎకరానికి 100 రూపాయల లీజు పద్ధతిన 66 ఏళ్లపాటు కళాశాలలన్నిటినీ ప్రైవేటువారికి ధారాదత్తం చేయడానికి నిర్ణయించారు.
ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే 1992 ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు రంగంలో వైద్య కళాశాలలకు అనుమతిస్తున్నదన్న అంశం మీద అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు, ఇప్పుడు ఏకంగా 17 వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు పూనుకున్నారు. ‘అప్పటికీ ఇప్పటికీ నా ఆలోచనలు మారాయి. నేను చాలా ముందుకు పోయాను’ అని ఆయన అనొచ్చు కానీ ఏ కాలంలో అయినా, ఎవరి ఆలోచనలో ఎన్ని మార్పులు వచ్చినా విద్య, వైద్య రంగాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉండటమే సరైన విధానం. నిజానికి 1992 వ్యవహారంలో కోర్టు తప్పుబట్టడంతో జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయి వైద్య రంగాన్ని ప్రైవేటు వ్యక్తులు,
సంస్థల చేతుల్లో పెట్టేందుకు తహతహలాడిపోతున్నారు. ఈ అంశంమీద ఆంధ్రప్రదేశ్‌లో పెద్దయెత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. సహజంగానే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించే పనిలో పడింది. సరిగ్గా ఇదే సమయంలో శాసనసభ సమావేశాలలో కామినేని శ్రీనివాస్ అనే బిజెపి సభ్యుడు సభలో ఒక అసందర్భ ప్రస్తావన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సినిమావారిని, అందునా ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని అవమానించాడని మాట్లాడారు. అప్పుడు సభలోనే ఉన్న టిడిపి సభ్యుడు బాలకృష్ణ కామినేని శ్రీనివాస్ మాటలను ఖండిస్తూ చిరంజీవిని, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఇద్దరినీ అవమానించే విధంగా మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డిని శాసనసభ లోపల, వెలుపల అధికారంలో ఉన్ననాడు, ప్రతిపక్షంలో ఉన్ననాడు కూడా అనరాని మాటలు, అసభ్యకరమైన దూషణలు అనేకం చేసిన పార్టీ ప్రతినిధిగా బాలకృష్ణ అలాంటి పరుషపదాలు వాడటంలో ఆశ్చర్యం లేదు. గత ఎన్నికల ప్రచార సమయంలో బాలకృష్ణ బావగారు చంద్రబాబు, తన అల్లుడు లోకేష్, తన తమ్ముడిగా దత్తత తీసుకున్న పవన్ కళ్యాణ్ ప్రచారసభల్లో జగన్మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా అవమానకరంగా మాట్లాడిన మాటలు, ఉపయోగించిన భాష తెలియనిదేమీ కాదు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన ఒక కుంభకోణంలో నిందితుడిగా చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో పాదయాత్రలో ఉన్న లోకేష్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యానాలు గాని, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఛోటా నాయకుడు ఒకరు జగన్మోహన్ రెడ్డి తల్లిని దూషించిన వ్యవహారంకంటే శాసనసభలో బాలకృష్ణ మాట్లాడింది ఎక్కువేం కాదు.
బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ ఇద్దరి మాటల మీదా అమెరికాలో ఉన్న చిరంజీవి వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి తమను చాలా గౌరవించారని, అమర్యాద ఏమీ జరగలేదని ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికల ప్రచార సభల్లో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కొన్ని వందలసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అన్న చేత దండం పెట్టించుకున్నారని, అగౌరవపరిచారని ప్రచారం చేసుకున్నా నోరు మెదపని చిరంజీవి ఇప్పటికైనా వాస్తవం మాట్లాడినందుకు సంతోషించాల్సిందే. కానీ అప్పుడే ఎందుకు ఈ విషయం ఆయన చెప్పలేదు అన్నది మాత్రం శేష పశ్నగానే మిగిలిపోతుంది. బహుశా సినిమా రంగంలో బాలకృష్ణకు, ఆయనకు ఉన్న బద్ధవైరం కారణంగా ఇప్పుడు ఇలా స్పందించి ఉంటారేమో. ఇంకెక్కడా లేని విధంగా తెలుగు సినిమా పరిశ్రమను కులజాడ్యం పట్టిపీడిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఓ రెండు కులాల వాళ్ళు సినిమా రంగం మీద ఆధిపత్యంకోసం తెగ ఆరాటపడిపోతుంటారు. రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఆ రెండు కులాలు, ఓ మూడు పార్టీలు ఒక్కటి కావలసిన పరిస్థితి. అయినా అప్పుడప్పుడు ఇలా బాలకృష్ణ రూపంలో రాజకీయ వేదికల మీద కూడా ఈ రెండు కులాల కుమ్ములాట బహిర్గతం అవుతూ ఉంటుంది.
చిరంజీవి దంపతులను తన ఇంటికి ఆహ్వానించి బయటనుండి సాదరంగా లోనికి తోడ్కొని పోయి విందు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి దంపతులు సత్కరించిన ఉదంతాన్ని వక్రీకరించి అవమానించారని ఆనాడు గుండెలు బాదుకున్న పవన్ కళ్యాణ్, ఇవాళ శాసనసభ సాక్షిగా చిరంజీవిపట్ల అవమానకర వ్యాఖ్యలుచేసిన బాలకృష్ణ వ్యవహారంలో మాత్రం నోరు మెదపలేదు. అందుకు కారణం ఆయన జ్వరపీడితుడై ఉండడమని పవన్ కళ్యాణ్ కు సంబంధించినవాళ్ళు సమర్ధించుకుంటున్నారు. జ్వరం వచ్చినంత మాత్రాన ఒక లిఖితపూర్వక ప్రకటన కూడా విడుదల చేయలేనంత అనారోగ్యంతో ఆయన ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. బహుశా అప్పుడు ఎలా అయితే చంద్రబాబు నాయుడును మెప్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి తన అన్నను అవమానించారని గుండెలు బాదుకున్నాడో ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడును మెప్పించడంకోసం తన అన్నను బాలకృష్ణ అవమానిస్తుంటే మౌనముద్ర వహించారని అనుకోవాలి.
ఇక అసెంబ్లీలో బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తూ చేసిన వ్యాఖ్య మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పెద్దయెత్తున విరుచుకుపడ్డాయి. ఈ విషయంలో రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. అందులో ప్రధానమైన వాటి గురించి చెప్పుకోవాలి. ఒకటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన. దాని గురించి చెప్పుకోవాలంటే ఓ 20 సంవత్సరాల క్రితం బాలకృష్ణ నివాసంలో జరిగిన రెండు సంఘటనల గురించి మాట్లాడుకోవాలి. ఆ రెండు సంఘటనల్లోనూ ఆయన ఇంట్లో తుపాకులు మోగాయి. మొదటి తుపాకీ కాల్పుల సంఘటనలో ఒక సినీ నిర్మాత, ఒక జ్యోతిష్కుడు తీవ్రంగా గాయపడ్డారు. రెండో సంఘటనలో ఒక వాచ్‌మెన్ మరణించాడు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఈ సంఘటనల విషయంలో కేసులేమయ్యాయో ఎవరికీ తెలియదు. ఆయన మానసిక స్థితి సరిగా ఉండదన్న డాక్టర్ సర్టిఫికెట్ తో బాలకృష్ణ మీద ఎటువంటి చర్య లేకుండా పోయింది.
ఇతరుల మీద కాల్పులు జరిపి ప్రాణహానికి కారకుడయ్యేంత ప్రమాదకర స్థితిలో ఉన్న వ్యక్తి తుపాకీ లైసెన్సు వెంటనే రద్దు చేసి ఎర్రగడ్డలోని మానసిక రోగుల చికిత్స కేంద్రంలోనో, విశాఖపట్నంలోని మానసిక చికిత్స కేంద్రంలోనో చేర్పించి చికిత్స జరిపించాల్సింది పోయి ఆయనను జనంలోకి ఎలా వదులుతారు? ఆయన ఈ 20 ఏళ్లుగా ఎన్నో సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. మూడుసార్లు ఎన్నికల్లో పోటీచేసి శాసనసభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. మరి అటువంటి స్థితిలో ఉన్న మనిషి జనంలో తిరిగేందుకు అవకాశం కల్పించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప మనసుతో చేసిన నిర్ణయమే అయినా తప్పుపట్టాల్సిందే. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాళ్లు రాజశేఖర్ రెడ్డిగారి మంచితనంవల్లనే నువ్వు కేసులోనుంచి బయటపడగలిగావని ఇప్పుడు బాలకృష్ణను విమర్శించడంలో అర్థం లేదు.
రాజశేఖర్ రెడ్డిగారు ఒక సందర్భంలో శాసనసభలోనే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉద్దేశించి ‘బాలకృష్ణ ఇంట్లో జరిగిన సంఘటననైనా మేము రాజకీయంగా వాడుకున్నామా చంద్రబాబు’ అని వ్యాఖ్యానించారు. నిజమే, మానసిక స్థితి బాగాలేక కాల్పులు జరిపి ఇద్దరిని గాయపరిచిన ప్రతిపక్ష నాయకుడి బావమరిది అంశాన్ని రాజకీయం చేయకపోవడం రాజశేఖర్ రెడ్డి పెద్ద మనసుకు నిదర్శనమే. రాజశేఖర్ రెడ్డి స్థానంలో చంద్రబాబు నాయుడు ఉంటే ఏంచేసి ఉండేవారో ఊహించడం కష్టమేమీ కాదు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఆ సంఘటనను రాజకీయం చేయకపోవడం మంచిదే కానీ చట్టప్రకారం చర్యలు తీసుకుని ఆ నేరానికి తగిన శిక్ష బాలకృష్ణకు పడే విధంగా చూసి ఉంటే బాగుండేది. అది జరగలేదు. పోనీ ఆయన మానసిక స్థితి నిజంగానే బాగా లేదా అంటే అదో కట్టుకథ. ఆయనని శిక్షనుంచి తప్పించేందుకు కొందరు వైద్యులు సృష్టించిన తప్పుడు సర్టిఫికెట్ అని ప్రముఖ వైద్యుడు కాకర్ల సుబ్బారావు చంద్రబాబు నాయుడు సన్నిహిత టివి ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు.
ఈ కాకర్ల సుబ్బారావు వైద్యరంగంలో విశేష ప్రతిభ గలవారే. బోలెడు సంపాదనకు అవకాశం ఉన్న అమెరికా జీవితాన్ని వదులుకుని మాతృదేశంలో వైద్య సేవలు అందించడానికి వచ్చినవారే. అయినంత మాత్రాన ఒక నేరస్థుడిని రక్షించడానికి పథకం వేశానని ఏకంగా టివి ఛానెల్లో కూర్చుని మాట్లాడితే అదీ నేరమే కదా. ప్రస్తుతం జీవించి లేరు. కాబట్టి కాకర్ల సుబ్బారావు గురించి ఎక్కువ మాట్లాడటం బాగుండదు కానీ అంత పెద్దమనిషి చేసిందేమిటి? ఓపెన్‌గా హృదయం విప్పి ఒక టివి షోలో ‘నేనే సహాయం చేసాను కేసులో నుండి బాలకృష్ణను బయట పడేయటానికి’ అంటారా? ఆయన మీద కూడా తప్పుడు సర్టిఫికెట్ ఇప్పించినందుకు కేసు పెట్టాల్సింది. ఆయన కోరినందుకు ఆతప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన సైక్రియాట్రిస్టుల మీద కూడా చట్టపరమయిన చర్యలు ఉండాల్సింది.
కాకర్ల సుబ్బారావును ఇంటర్వ్యూ చేసిన యాంకర్ వివరించినట్టు అటువంటి మానసిక స్థితిలో ఉన్నవారు ఎదురుగా ఉన్నవారి మీద కాల్పులు జరుపుతారు, ఆ అవకాశం లేకపోతే తమను తామే కాల్చుకునే ప్రమాదం ఉంటుంది అని ఆ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్లు నిజంగానే నిర్ధారించుకుని ఉంటే బాలకృష్ణను ఎర్రగడ్డకో, వైజాగ్ కో తక్షణం తరలించండని సూచించి ఉండాల్సింది కదా. ఇది ఇంతటితో ముగిసిపోలేదు.. ఇంకా దాదాపు నాలుగేళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసినప్పుడల్లా వాటినుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఇటువంటి ప్రహసనాలు అనేకం తెరమీదకు తెస్తూనే ఉంటుంది. ఒక సందర్భంలో శాసనసభను ఇది కౌరవసభ అని బహిష్కరించి బయటకు నడిచిన ప్రస్తుత సభానాయకుడు చంద్రబాబు నాయుడు నిన్నటి బాలకృష్ణ ఉదంతంలో ధృతరాష్ట్ర పాత్రధారి అయ్యారు.
-
Home
-
Menu