బంగ్లాదేశ్‌తో భారత్ దౌత్యం కుదిరేనా?

భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు ప్రస్తుతం సరిగ్గా లేకపోయినా ఆ దేశంతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోంది. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఇటీవల భారతీయ హిందూ మతవ్యక్తులు కొందరు బంగ్లాదేశ్ మతోన్మాదుల దాడులకు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో అంటే ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే కొత్త ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ బాధ్యతలు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో బంగ్లాదేశ్ నుంచి బహిష్కృతురాలైన ‘ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా గత వారం బంగ్లాదేశ్ పాలక వర్గానికి వ్యతిరేకంగా చేసిన ప్రసంగం బంగ్లాదేశ్ భారత్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ఆటంకం కలిగించే పరిస్థితి ఎదురైంది. షేక్ హసీనా మహమ్మద్ యూనస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. యూనస్ ఒక ‘హంతక ఫాసిస్ట్’ అని ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి అక్కడ యువతను రెచ్చగొట్టి ఏ విధంగా ఆందోళనలు లేవదీశారో వివరిస్తూ ప్రసంగించారు. బంగ్లాదేశ్ బయటశక్తుల పన్నాగం వల్ల తన ప్రభుత్వం కూలిపోయిందని వివరించారు.
మైనారిటీ వర్గాలకు చెందిన వారిపై దాడులను అరికట్టడంలో యూనస్ ప్రభుత్వం వైఫల్యం బాగా కనిపిస్తోంది. శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. యూనస్ సామర్థంపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో సంబంధాలను పటిష్ట పర్చుకోడానికి భారత్ ప్రయత్నిస్తుండడం వ్యర్థమన్న వాదనలు వస్తున్నాయి. అయినా సరే ఈ విషయంలో కొత్త మార్గాలను భారత్ అనుసరించక తప్పదన్న ఆలోచన తెరపైకి వస్తోంది. అందువల్ల బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు భారత్ నిరీక్షించక తప్పదని తెలుస్తోంది. బంగ్లాదేశ్ గత ఎన్నికల్లో బిఎన్‌పి పోటీ నుంచి విరమించి హసీనాకు అవకాశం కల్పించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా లేవు. పోటీ చేయడానికి ఇప్పుడు అందరికీ అవకాశం కలగకపోవచ్చు. విద్యార్థులు, అతివాద వర్గాలు లేరని ప్రతి బంధకాలుగా ఉన్నారు. అయితే ఎన్నికల్లో సరైన తీర్పు వచ్చి నూతన ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావంతో భారత్ ఉంటోంది.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ టీమ్ గత ఏడాది నుంచి భారత్‌కు దూరంగా ఉండడం భౌగోళిక రాజకీయ వివాదాలకు దారితీస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్ శ్రీలంక మధ్య టి 20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో పర్యటించకూడదని బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకోవడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. బంగ్లాదేశ్ ఎన్నికలు కొన్ని వారాల్లో జరగనున్న తరుణంలో మాజీ ఢాకా పోలీస్ కమిషనర్, మరో ఇద్దరు పోలీస్ అధికారులపై సోమవారం (26126) స్పెషల్ బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం సంచలనం కలిగిస్తోంది. 2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లకు హసీనా ప్రభుత్వమే కారణమని ఆరోపణలు రావడంతో ఆ ప్రభుత్వంలో పని చేసిన ఈ పోలీస్ ఆఫీసర్లను బాధ్యులుగా నేరారోపణ చేస్తూ ఈ మరణ శిక్షపడింది. జస్టిస్ మొహమ్మద్ గొలం మోర్టుజా మొజుందార్ నేతృత్వం లోని ముగ్గురు జడ్డీలతో కూడిన ప్యానెల్ ఈ మరణ శిక్ష విధించింది.
మాజీ ఢాకా మెట్రో పాలిటన్ పోలీస్ (డిఎంపి) కమిషనర్ హబీబుర్ రెహ్మాన్, మాజీ డిఎంసి జాయింట్ కమిషనర్ సుదీప్ కుమార్ చక్రవర్తి, అడిషనల్ డెఫ్యూటీ కమిషనర్ మొహమ్మద్ అఖ్తరువ్ ఇస్లాం ఈ మరణ శిక్షను ఎదుర్కోనున్నారు. బంగ్లాదేశ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ఐసిబిబిడి) విధించిన రెండో మరణ శిక్ష ఇది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఈ ట్రిబ్యునల్ ఇంతకు ముందు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అలాగే అప్పటి హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమల్‌పై కూడా ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. అంతేకాదు. ఢాకా అసిస్టెంట పోలీస్ కమిషనర్ మొహమ్మద్ ఇమ్రూల్‌కు ఆరేళ్లు జైలు శిక్ష, ఇన్‌స్పెక్టర్ అర్షాద్ హోస్సయన్ హు నాలుగేళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు సుజోన్ హోస్సయన్, ఇమాజ్ హోస్సయన్, నసిరుక ఇస్లామ్‌కు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. వీరిలో కొందరు పరారీలో ఉన్నారు. గత నవంబర్ లోనే హసీనాకు మరణ శిక్ష పడినా భారత్‌లో ఆమె తలదాచుకోవడంతో ఇంకా శిక్ష అమలు కాక పెండింగ్‌లో ఉంది. ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరుతోంది. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ యూనస్‌ను ‘హంతక ఫాసిస్ట్’ అని తీవ్రంగా హసీనా విమర్శిస్తూ ప్రసంగించిన టేపు ఇప్పుడు విడుదలై అనేక వివాదాలకు దారి తీయడమే కాక, బంగ్లాదేశ్‌ను మరింత రెచ్చగొడుతోంది. ఈ ప్రసంగం హసీనా చేయడానికి భారత్ ఎలా అవకాశం కల్పించిందని బంగ్లాదేశ్ ప్రశ్నిస్తోంది. ఇవన్నీ భారత్ పై బంగ్లాదేశ్ వ్యతిరేకతను మరింత పెంచే సంకేతాలు అందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో దౌత్య సంబంధాలు కుదుర్చుకోడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు నెరవేరుతాయా అన్న అనుమానం కలుగుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశంలో హిందూ మైనార్టీ వర్గాలపై చెలరేగుతున్న దాడులను కూడా బంగ్లాదేశ్ అరికట్టడానికి గట్టిగా ప్రయత్నించవలసి ఉంది. ఎన్నికలు పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేలా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలి. అంతవరకు బంగ్లాదేశ్‌లో శాంతి వాతావరణం నెలకొనదు. భారత్‌కు దౌత్యపరమైన సంబంధాలు సాగించే అవకాశం కలగదు.
-
Home
-
Menu
