డొనాల్డ్ ట్రంప్ మలి జూదం

ఫిబ్రవరి 28 నుంచి మార్చి చివరి వరకు 32 రోజులపాటు సాగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి జూదం విఫలమైంది. దానితో ఆయన యుద్ధం మొదలైన తర్వాత మొదటిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి ఏప్రిల్ 1న ప్రసంగించిన తర్వాత మలి జూదం ఆరంభించినట్లు కనిపిస్తున్నది. ఆ విధంగా, మరుసటి రోజున ఇరాన్‌లోని పౌర సదుపాయాలపై దాడులు మొదలుపెట్టారు. తన ప్రణాళికలకు సరిగా ఉపయోగపడటం లేదని కావచ్చు తమ సీనియర్ సైనికాధికారులకు ఉద్వాసన చెప్పటం చేశారు. ఇకనైనా ఇరాన్ తన షరతులకు పూర్తిగా అంగీకరించి ఒప్పందం చేసుకోనట్లయితే అతి భీకరమైన యుద్ధం సాగించి ఇరాన్‌ను ‘శిలాయుగం’ నాటి పరిస్థితులలోకి తీసుకు వెళ్లగలనని హెచ్చరించారు.
ఈ మలి జూదం రాగల వారాలలో ఎట్లా సాగగలదో, ఈసారి అయినా ట్రంప్ నెతన్యాహూ కోరుకున్న ఫలితాలను ఇవ్వగలదేమో చూడవలసి ఉంది. ఇరాన్ మాత్రం అమెరికా అధ్యక్షుని ప్రసంగం తర్వాత ఒకసారి, ఆ తర్వాత పౌర సదుపాయాలపై దాడులు మొదలైన తర్వాత మరొకసారి సమాధానమిస్తూ, తమను ఇవేవీ లొంగదీయలేవని ధిక్కరించింది. అంతటితో ఆగక ఆ వెంటనే ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాలలోని అమెరికన్ సైనిక స్థావరాలపై, అమెరికాకు చెందిన హైటెక్ కంపెనీలు, స్టీల్ కంపెనీలపై ఎదురు దాడులు జరిపింది. అమెరికా దాడుల వల్ల ఇరాన్‌లో కలిగిన నష్టాల చిత్రాలు వెంటనే ప్రసారమయ్యాయి. వాటిలో ఒకటి ఇంకా నిర్మాణంలో ఉన్న చాలా ఎత్తయిన వంతెన కాగా, మరొకటి ఔషధ కర్మాగారం. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలలో జరిగిన నష్టాల చిత్రాలు మాత్రం రాలేదు. ఆ దేశాలన్నీ కఠినమైన సెన్సారింగ్ విధించినట్లు పాశ్చాత్య దేశాల మీడియానే ప్రకటిస్తున్నది. అయితే ఈ దాడి గురించి స్వయంగా ఇజ్రాయెల్ ప్రభుత్వమే, ఇరాన్ ఇంతటి భారీ దాడి జరపటం ఇదే మొదటిసారని అంగీకరించటం గమనించదగ్గది.
మొదటి దశ యుద్ధ కాలమంతా అమెరికా, ఇజ్రాయెల్ చెప్తూ వచ్చిందేమిటి? ఇరాన్‌ను సైనికంగా 90 శాతం వరకు తుడిచిపెట్టామని, అణు పరిశోధనా కేంద్రాలు, క్షిపణి నిల్వలు, డ్రోన్లు, వాటి నిల్వలు, తయారీ కేంద్రాలు, లాంచర్లు ధ్వంసమైపోయాయని, ఇరాన్ సైన్యంలో అతి కీలక విభాగమైన రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జిసి) నిర్వీర్యమైపోయిందని, వైమానిక బలం యావత్తు మట్టిపాలు కాగా, నౌకాబలమంతా సముద్రం అడుగుకు మునిగిపోయిందని. ఇవన్నీ ట్రంప్ మాటలే. అది తాను ఒకటి రెండు సార్లు కాదు, పదే పదే అంటూ వచ్చారు. అమెరికా సైనిక పాటవం యావత్ ప్రపంచంలోనే అత్యంత బలోపేతమైనది సుమా అని కూడా ప్రతిసారి ఇరాన్‌తోపాటు అన్ని దేశాలకు గుర్తు చేస్తూ వస్తున్నారు.
మొదటి దశ దాడులు రెండు రోజులలో ముగియగలవని వారు అంచనా వేయగా 32 రోజులు సాగాయి. అమెరికా తోపాటు ఇజ్రాయెల్ ఉమ్మడి బలాన్ని తట్టుకున్న ఇరాన్ ఇంతకాలం తన ఎదురు దాడులతో ఆ ఇద్దరితోపాటు గల్ఫ్ రాజ్యాలకు తీవ్రమైన నష్టాలను కలిగించింది. వివరాలు ఇక్కడ రాయనక్కరలేదు గాని, అమెరికా, ఇజ్రాయెల్ ప్రచారం చేసినట్లు ఇరాన్ సైనిక శక్తి ధ్వంసం మాత్రం కాలేదని ప్రపంచానికి అర్థమైంది. ఇరాన్ ప్రత్యర్థులకు మరింత బాగా అర్థమైంది. ఇందుకు అదనంగా హర్మూజ్‌ను ఇరాన్ దిగ్బంధించగా, బాబ్ అల్ మందెల్‌ను కూడా దిగ్బంధించేందుకు హూతీలు సిద్ధపడుతుండటం, లెబనాన్, ఇరాక్‌లలోని మిలిటెంట్ సంస్థలు అమెరికా, ఇజ్రాయెల్ సంబంధిత స్థావరాలపై దాడులు ఆరంభించటంతో ఆ రెండు దేశాలకు ఊపిరి సలపకుండా ఉంది. ఇటువంటి స్థితిలో ఏమి చేయాలో తోచని ట్రంప్, ఇరాన్‌పై భూతల యుద్ధం కోసమంటూ సేనలను మోహరించి కూడా వాటిని ఓడలపై నుంచి నేలపైకి దింపటానికి గాని లేదా పారాచూట్ల ద్వారా విమానాల నుంచి జారవిడవటానికి గాని సాహసించటం లేదు.
ఈ పరిస్థితుల ప్రభావంతో చమురు కొరతలు ఏర్పడి, ధరలు పెరుగుతూ ఇంటా బయటా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్, తమకు సాయంగా వచ్చేందుకు యూరప్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సహా ఏ ఒక్కరూ ముందుకు రాకపోవటంతో వారిపై ఆగ్రహిస్తూ, అమెరికా మాత్రం నాటోలో ఎందుకుండాలని ప్రశ్నించటం మొదలు పెట్టారు. దీనంతటి సారాంశం ఏమంటే, 32 రోజుల తొలి దశ యుద్ధం పూర్తిగా విఫలమైంది. దాడులకు ముందు ప్రకటించిన అరడజను లక్షాలలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. మొదటి దశ చివరకు వస్తున్న వేళ, ఇరాన్‌తో రాజీకోసమంటూ 15 షరతులు ప్రకటించారు. ఇరాన్ అడగకుండానే తనంతటతానే అందుకు ప్రతిగా ఇరాన్ అయిదు షరతులు ముందుంచింది. ఆ మొత్తం 20లో ఏ ఒక్కటీ జరిగేది కాదని వాటిని చూసిన వెంటనే అందరికీ అర్థమైంది. జరిగింది కూడా అదే.
ఆ విధంగా సాగిన మొదిటి దశకు, ఏప్రిల్ 1 నాటి ట్రంప్ ప్రసంగానికి మధ్య గల సంధి దశలో అమెరికా అధ్యక్షుడు ఎపుడేమి అంటున్నారో తెలియని విధంగా ఊగిసలాడారు. లక్షాలన్నీ దాదాపు సాధించి వేశామని, ఇక ఏ క్షణమైనా నిష్క్రమిస్తామని ఒకసారి, దాడులు ఇంకా తీవ్రం చేస్తామని మరొకసారి, ఇరాన్ లొంగిపోవాలని ఒకసారి, లొంగకున్నా సరేనని మరొకసారి, హర్మూజ్‌ను తెరిపించి తీరుతామని ఒకసారి, అటువంటి అంగీకారం కుదరకున్నా పరవాలేదని మరొకసారి, యూరప్ తమకు తోడు రావాలని ఒకసారి, రాకున్నా సరేనని ఇంకొకసారి, అక్కడి చమురు తమకు అవసరం లేదు గనుక మీరే పోయి తెచ్చుకొండని ఒక రోజు మాట్లాడుతూ తమ బలహీనతలను తానే బయట పెట్టుకుంటూపోయారు. తమను అనవసరంగా యుద్ధంలోకి లాగారని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఇజ్రాయెల్ ప్రధానిపై కేకలు వేసే వరకు వెళ్లింది పరిస్థితి.
మామూలుగానైతే ఇన్నిన్ని వైఫల్యాల దృష్టా అమెరికన్లు ఈ మొదటి దశ అనంతరం యుద్ధం నుంచి నిష్క్రమించాలి. ఇరాన్‌కు చాలా నష్టాలే కలిగించినందున విజయం సాధించినట్లేనని ప్రకటిస్తూ ఇక వెళ్లిపోవటం గౌరవప్రదంగా ఉంటుందని పలువురు నిపుణులు ట్రంప్ కు సూచించారు కూడా. చాలా లక్షాలు నెరవేరాయని ట్రంప్ కూడా అంటుండినందున, నిష్క్రమించగలమనే సూచనలు కూడా చేస్తుండినందున, అదే విధంగా జరగగలదని పలువురు భావించారు. తన ఏప్రిల్ 1 ప్రసంగంలో అదే విషయం ప్రకటించగలరనే అభిప్రాయం కూడా ఏర్పడింది. కాని అంతలోనే ఏమి జరిగిందో తెలియదు గాని, ఆయన మలి దశ యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధం పట్ల దేశంలో వ్యతిరేకత పెరుగుతుండటంతో (ఒక అంచనా ప్రకారం మూడింట రెండు వంతులు. ఆ వ్యతిరేకులలో తన ‘మాగా’ మద్దతుదారులు కూడా ఉన్నారు.) వారికి నచ్చచెప్పటం కోసమా అన్నట్లు కొన్ని మాటలు చెప్పారు.
యుద్ధం చేస్తున్నది వారి ‘భవిష్యత్ కోసం పెట్టుబడి’ అన్నారు. గతంలో అనేక యుద్ధాలు నెలలు, సంవత్సరాల తరబడి సాగటాన్ని గుర్తు చేస్తూ అమెరికన్లు కాస్త ఓపిక పట్టాలని కోరారు. ఇంతవరకు జరిగిన యుద్ధంలో లక్షాలు అధిక భాగం నెరవేరాయని నమ్మించజూసారు. అణ్వస్త్రాలు తయారు చేస్తున్న ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టనట్లయితే అమెరికాకు, ఇజ్రాయెల్‌కు, గల్ఫ్ దేశాలకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని భయపెట్టజూసారు. కాని ఆయన ఎంతో శ్రమపడి మరొక మారు చెప్పిన అవే పాత మాటలు ఎవరినీ నమ్మించలేదు. ఆ వెంటనే చమురు ధరలు పెరగగా, స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ప్రజలలో నమ్మకం పెరగలేదు.
ఇదంతా ఎట్లున్నా లెక్క చేయదలచుకోని ట్రంప్, తన ప్రసంగం ముగిసి ఒక రోజైనా గడవక ముందు రెండవ దశ యుద్ధం మొదలు పెట్టారు. ఈ దాడులు వంతెనలు, మందుల కంపెనీల వంటి పౌర కేంద్రాలతో ఆరంభం కావటం గమనించదగ్గది. రాగల రోజులలో ఏమయేదీ చూడవలసి ఉంది. లక్షాలను చేరలేకపోయినట్లు అంగీకరించి (పరోక్షంగానైనా కావచ్చు) వైదొలగితే ప్రపంచంలో, స్వదేశంలో పూర్తిగా మొహం చెల్లకపోవటం, నవంబర్ మధ్యంతర ఎన్నికలలో పరాజయ అవకాశాలు, ఇజ్రాయెల్ ఒంటరి కావటం, గల్ఫ్ రాజ్యాలకు నమ్మకం పోవటం, యూరప్ మరింత దూరం కావటం, రష్యా, చైనాల పలుకుబడి పెరగటం, ఇరాన్ మరింత స్వతంత్రంగా ఎదగటం వంటి అవకాశాలన్నీ ట్రంప్‌ను బాగా భయపెట్టినట్లున్నాయి. అందుకే, ఒక జూదగాడు చివరి గేమ్‌లో సర్వస్వం ఒడ్డినట్లు, ఈ మలి దశ జూదంలోకి దిగినట్లు కనిపిస్తున్నది.
- టంకశాల అశోక్ ( దూరదృష్టి)
- రచయిత సీనియర్ సంపాదకులు
-
Home
-
Menu
